రత్నవేలు అంటే ఏస్ సినిమాటోగ్రాఫర్. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా 'సైరా'కి సంబంధించిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఇటీవల జరిగిన పోరాట ఘట్టానికి సంబంధించి విశేషాలు పంచుకున్నారాయన. తక్కువ లైటింగ్‌తో అత్యద్భుతమైన పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందీ షాట్ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ మధ్య వర్షాల కారణంగా చిత్రీకరణకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయట. వాటిన్నింటినీ అధిగమించి ఈ పోరాట ఘట్టాల్ని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యింది సైరా టీమ్.
కథకు అత్యంత ప్రాధాన్యత కలిగిన పోరాట ఘట్టమిది. విజయవంతంగా పూర్తి చేశారు. 35 రాత్రులు తక్కువ లైటింగ్‌లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్‌ని తెరపై చూసిన ప్రేక్షకులు ఖచ్చితంగా సరికొత్త అనుభూతికి లోనవుతారనీ రత్నవేలు అభిప్రాయ పడుతున్నారు. హైద్రాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ పోరాట ఘట్టాన్ని చిత్రీకరించారు. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
తమిళ నటుడు విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో మరో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. నయనతార మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.