ఈ మధ్య హైద్రాబాద్‌లో 'సైరా' కోసం వేసిన ఓ భారీ సెట్‌లో షార్ట్ సర్య్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి, సెట్ పూర్తిగా దగ్ధమైపోయిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా కోట్లలో సైరా నిర్మాతకు నష్టం వాటిల్లింది. ఇక ప్రస్తుతం సైరా టీమ్ పాండిచ్చేరిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్‌లో భాగంగా లైవ్ లొకేషన్స్‌కి సైరా ప్రాధాన్యత ఇచ్చిందట. కథలో అత్యంత కీలకమైన పార్ట్ ఇక్కడ చిత్రీకరిస్తున్నారట. బ్రిటీష్ అధికారులకీ, నరసింహారెడ్డికీ మధ్య జరిగే అతి కీలకమైన ఒప్పందాల నేపథ్యంలో తెరకెక్కే సన్నివేశాలట ఇవి. వీటి కోసం ఆ కాలం నాటి బ్రిటీష్ బిల్డింగులు సెట్ వేయాల్సి ఉందట.
కానీ, అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో, పాండిచ్చేరిలో ఇంకా మిగిలున్న ఆ కాలం నాటి కొన్ని అవశేష భవనాల్లో సైరా టీమ్ చిత్రీకరణ జరుపుతోందనీ సమాచారమ్. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న 'సైరా' చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు చివరి దశ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ కాగానే, నిర్మాణానంతర కార్యక్రమాలపై సైరా టీమ్ దృష్టి పెట్టనుంది. అక్టోబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'సైరా' ట్రైలర్ విడుదలను ప్లాన్ చేస్తున్నారు.