హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ నేతృత్వంలో మొన్న 35 రోజుల పాటు చీకటి రాత్రుల్లో ఏకధాటిగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకున్న సైరా టీమ్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలోని కొండ, కోనల్లో, జలపాతాల్లో షూటింగ్‌కి సిద్ధమవుతోంది. ఇక్కడ కూడా యాక్షన్ ఘట్టాలే తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ ఘట్టాలు ప్రముఖ కొరియోగ్రాఫర్లు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో రూపొందుతున్నాయి. ఫిలిం సిటీలో ఇందుకోసం ఓ స్పెషల్ సెట్‌ని ఏర్పాటు చేశారు.
బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్రోద్యమ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం కాబట్టి, యాక్షన్ ఘట్టాలకు, భీకరమైన పోరాట సన్నివేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ చిత్రంలో. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్కానర్‌లో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.
బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా 'సైరా' రూపొందుతోంది. తెలుగు నటీ నటులే కాక, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోని ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకి పని చేస్తున్నారు.
వచ్చే ఏడాది 'సైరా' ప్రేక్షకుల ముందుకు రానుంది.