మొదటి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'సైరా'. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రంపై రోజుకో వివాదం చక్కర్లు కొడుతోంది.
అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో సెట్ నిర్మించి, షూటింగ్ నిర్వహించారన్న కారణంగా రెవెన్యూ అధికారులు 'సైరా' సెట్‌ని కూల్చివేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ సెట్‌లో షూటింగ్ పూర్తైపోయినందుకే చిత్ర యూనిట్ ఆ సెట్‌ని కూల్చివేసిందని మరోవైపు వాదన వినిపిస్తోంది. ఈ వివాదంపై ఇంతవరకూ సైరా టీమ్ స్పందించలేదు.
ఇదిలా ఉండగా, తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు కొత్త ఆరోపణ లేవనెత్తారు. చిత్రం షూటింగ్ మొదలయ్యాక తమను సంప్రదించలేదని వారు ఆరోపిస్తున్నారు. కొన్ని ఛానెల్స్ ఈ వాదనకు బలం చేకూరుస్తూ, మీడియాలో చర్చలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బయోపిక్స్ తెరకెక్కేటప్పుడు ఆ బయోపిక్‌కి సంబంధించిన పలు అంశాలను తెలుసుకునే దిశగా చిత్ర యూనిట్ చాలా రీసెర్చ్ చేస్తారు. బోలెడంత గ్రౌండ్ వర్క్ చేస్తారు. చరిత్రలు టచ్ చేయడమనేది అంత ఆషామాషీ విషయం కాదు. అలాంటిది మెగాస్టార్ నటిస్తున్న 'సైరా' విషయంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాలి.
ఈ ఆరోపణలపై నిజముండి ఉంటే, సైరా టీమ్ వెంటనే స్పందించి ఉండేది. అలా జరగలేదు అంటే ఈ ఆరోపణల్లో నిజమెంతుందో. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.