నైజాంలో మెగాస్టార్ చిరంజీవి ఆధిపత్యం కొనసాగుతూనేఉంది. రాజకీయాల్లోకి వెళ్లక ముందు నైజాంలో చిరు తిరుగులేని స్టార్. ఇక్కడ చిరు సినిమాలు విడుదలైతే, టాక్‌తో పని లేకుండా భారీ వసూళ్లు చేజిక్కించుకునేవి. చిరు రాజకీయాల్లోకి వెళ్లాక ఆ ప్రభావం నైజాం వసూళ్లపై పడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ అలాంటివేం జరగలేదు. రీ ఎంట్రీ లో వచ్చిన తొలి సినిమా 'ఖైదీ నెం.150' నైజాంలోనూ మంచి వసూళ్లు అందుకుంది. నాన్ బాహుబలి రికార్డుని నైజాంలో బ్రేక్ చేసింది.
ఇక సైరా అయితే సరికొత్త చరిత్ర సృష్టించింది. నైజాంలో 32 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. నైజాంలో 30 కోట్ల మార్క్‌ని ఇప్పటి వరకూ రెండే రెండు సినిమాలు దాటాయి. అవి బాహుబలి 1, బాహుబలి 2. ఇప్పుడు ఆ జాబితాలో సైరా కూడా చేరింది. ఈ సినిమాని నైజాంలో యూవీ క్రియేషన్స్ విడుదల చేసింది. 30 కోట్లకు ఈ సినిమా వసూళ్లు దక్కించుకుంది. సైరా 32 కోట్లు దక్కించుకోవడంతో యూవీ బ్రేక్ ఈవెన్ సాధించగలిగింది. మొత్తానికి నైజాం మొనగాడు అని మెగాస్టార్ మరోసారి నిరూపించుకున్నాడు.