తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సైరా'.. అని ఇంతవరకూ ప్రమోట్ చేశారు. కానీ, ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. 'సైరా' బయోపిక్ కాదంటున్నారు దర్శక, నిర్మాతలు. ఇదంతా ఎందుకు? అంటే 'సైరా'ని ఆవహించిన అనవసర వివాదాలే. ఈ సినిమా మొదలైనప్పటి నుండీ ఏదో ఒక మూల నుండి వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇచ్చిన మాట తప్పిందనీ, తమకు న్యాయం చేయాలనీ లేదంటే, సినిమా విడుదలను అడ్డుకుంటామని తాజాగా ఉయ్యాలవాడ వారసులు 'సైరా' టీమ్‌ని కోర్టుకీడ్చారు.
ఇష్యూ కోర్టు మెట్ల దాకా చేరడంతో సైరా దర్శక, నిర్మాతలు ప్లేట్ మార్చేశారు. అసలిది బయోపిక్కే కాదని మాట మార్చేశారు. దాంతో ఈ విషయం ఇప్పుడు సంచలనమైంది. బయోపిక్ అని ప్రమోట్ చేసిన సినిమా విడుదల దగ్గర పడ్డాకా బయోపిక్ కాదంటూ ప్రకటించడం సబబు కాదంటున్నారు.
సినిమా స్టార్ట్ చేయడానికి ముందు, ఏడు ఫ్యామిలీస్‌గా ఉన్న ఉయ్యాలవాడ కుటుంబీకులకు ఒక్కొక్క ఫ్యామిలీకి 15 లక్షల చొప్పున కోటి 5 లక్షలు పరిహారంగా ఇస్తామని ఒప్పుకున్న 'సైరా' టీమ్ తీరా విడుదల దగ్గరకొచ్చేసరికి చేతులేత్తేయడంతో ఉయ్యాలవాడ వారసులు కోర్టుకెక్కాల్సి వచ్చింది. మాటిచ్చినట్లుగా తమకు రావల్సిన పరిహారం వచ్చే వరకూ సినిమా విడుదల చేయడం కుదరదని వారు ఆందోళన చేస్తున్నారు. కొన్ని కోట్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించిన 'సైరా' టీమ్ ఇప్పుడు ఒక కోటి కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విమర్శల బాట పడుతోంది. మరి ఈ వివాదాన్ని 'సైరా' ఎదుర్కోనుందో చూడాలిక.