సైరా - నరసింహారెడ్డి.. వసూళ్ల పరంపరకు దెబ్బ పడింది. రికార్డుల పరంపరకు స్పీడు బ్రేకర్ ఎదురైంది. పైరసీ రూపంలో. ప్రతీ కొత్త సినిమాకీ పొంచి ఉండే పైరసీ భూతం సైరా విషయంలో మరోసారి పడగవిప్పింది. ఈ సినిమా విడుదలైన కొన్ని గంటలకే... హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ బయటకు వచ్చేసింది. దాంతో.. సైరా బృందం షాక్‌కి గురైంది. తమిళ రాక్ స్టార్ - సైరా ప్రింటుని ఆన్‌లైన్‌లో పెట్టేసింది. ఈ పైరసీ వల్ల - సైరా వసూళ్లు భారీగా పడిపోయే ప్రమాదం ఉంది.
సైరాని థియేటర్లలో చూడాలనుకునేవాళ్లు సైతం పైరసీని ఆశ్రయిస్తే ఆ దెబ్బ మామూలుగా ఉండదు. పైరసీలో కొన్ని కీలకమైన సీన్లు ముందే రివీల్ అయిపోతే, వెండి తెరపై సినిమా చూసేవాళ్లకు ఆ కిక్ ఉండదు. నిజానికి సైరా పైరసీని ఆపడానికి చిత్రబృందం భారీ ఎత్తున కసరత్తులు చేసింది. పైరసీని తట్టుకునేందుకు ఓ టీమ్ ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌లో ఎక్కడ సైరా లింకులు కనిపించినా, వాటిని తొలగించడం ఈ టీమ్ పని. అయితే.. సైరా పైరసీని ఆపడం ఆ టీమ్ వల్ల కాలేదు.
దాంతో.. సైరా టీమ్ తలలు పట్టుకుంటుంది. యాంటీ పైరసీ సెల్‌లో ఫిర్యాదు చేసి, సైరా పైరసీని అరికట్టాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలూ మొదలయ్యాయి. కాకపోతే దాని వల్ల ప్రయోజనం చాలా తక్కువ. ఎవరికి వాళ్లు మేం పైరసీ చూడకూడదు అనుకుంటే తప్ప - సైరా నష్టాన్ని తగ్గించలేం.