హమ్మయ్య... మొత్తానికి 'సైరా' షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాకి గుమ్మడి కాయ కొట్టేశారని ఫొటోగ్రాఫర్ సింథిల్ ట్వీట్ చేశాడు. డీఐ కూడా మొదలైపోయిందన్న చల్లని కబురు చెప్పేశాడు. అక్టోబరు 2న ఈ సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అక్టోబరు 2న ఈసినిమా విడుదల అవ్వడం ఖాయం అనుకోవొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక్కటే సమస్య. ఈ సినిమాలో కొన్ని కీలక ఘట్టాలు విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడి ఉన్నాయి. మరీ ముఖ్యంగా వార్ ఎపిసోడ్స్ అన్నీ - గ్రాఫిక్స్‌తో కూడుకున్నవే. అవి ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి.
గ్రాఫిక్స్ అనేది దర్శక నిర్మాతల చేతుల్లో ఉండని వ్యవహారం. గ్రాఫిక్ సంస్థలకు ఓ టార్గెట్ ఇచ్చినా - అంతలోపు పూర్తి చేయని సందర్భాలెన్నో ఉన్నాయి. రోబో 2.O సినిమా పలుమార్లువాయిదా పడడానికి ముఖ్య కారణం ఇదే. ఇప్పుడు 'సైరా'కీ అదే సమస్య వచ్చి పడింది. గ్రాఫిక్స్ ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి. అందుకే చరణ్ ఈ విషయంపై కాస్త సీరియస్‌గా దృష్టి పెట్టాడట. ఒకే సంస్థని నమ్ముకోకుండా.. ఒక్కో యాక్షన్ పార్ట్ ఒక్కో కంపెనీకి అప్పటించాడని తెలుస్తోంది.
వర్క్ ఎంత వరకూ అయ్యిందో, అందులో ఉన్న క్వాలిటీ ఎంతో ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడట. అక్టోబరు 2న ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనైనా విడుదల చేయాలన్నది చరణ్ పట్టుదల. కాకపోతే అది గ్రాఫిక్స్‌పైనే ఆధారపడి ఉంది.