ప్రజారాజ్యం పార్టీ స్థాపించి - 18 సీట్లతో సరిపెట్టుకున్నాడు చిరంజీవి. అయితే అవి కూడా ఆ తరవాత కాంగ్రెస్ పార్టీలోకి కలిసిపోయాయి. కాంగ్రేస్‌లోనూ చిరు ప్రాభవం ఎంతో కాలం కొనసాగలేదు. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే త్వరలోనే చిరంజీవి పార్టీ మారడం ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి ఆయన బీజేపీ జెండా మోయడం గ్యారెంటీ అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది టీడీపీ నాయకులు ఇప్పుడు బీజేబీ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇప్పటికే చాలామంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి ఏపీలోనూ పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. జనాకర్షణ ఉన్న నాయకుల్ని బీజేపీలోకి తీసుకోవాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. వాళ్ల చూపు ఇప్పుడు మెగాస్టార్ మీద పడింది. చిరంజీవి వస్తే ఏపీలోని ఓ సామాజిక వర్గం పూర్తిగా బీజేపీ వైపు వచ్చేస్తుందని వాళ్ల నమ్మకం. అందుకే బీజేపీ రాష్ట్ర పగ్గాలు చిరుకి అప్పగించి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే - లాభం ఉంటుందని లెక్కలేసుకుంటోంది.
అందులో భాగంగా కొంతమంది పెద్దలు ఇప్పటికే చిరుతో సంప్రదింపులు మొదలెట్టేశారని తెలుస్తోంది. మరి చిరంజీవి బీజేపీలోకి వస్తారా? గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారా? అనేది కాలమే చెప్పాలి.