తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధగా 'సైరా' తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో కేవలం దేశభక్తి మాత్రమే కాదు, కమర్షియల్ యాంగిల్ కూడా ఉంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డి చెబుతున్నాడు. మొదట్లో ఈ సినిమా కోసం కమర్షియల్ యాంగిల్ అస్సలు ఆలోచించలేదన్నారు. కానీ, చివరికి వచ్చేసరికి, 'సైరా'లో దేశభక్తితో పాటు, తల్లి సెంటిమెంట్, భార్య సెంటిమెంట్‌తో పాటు, లవ్ సెంటిమెంట్ కూడా ఉండనుందట.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని లక్ష్మి పాత్రలో ఉన్న తమన్నా ప్రేమిస్తుంది. కానీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సిద్దమ్మ పాత్ర పోషించిన నయనతారను వివాహమాడతాడు. అలాగే తల్లికిచ్చిన మాట నిలబెట్టుకుంటాడు.. ఇలాంటి ఎన్నో ఎమోషన్స్ 'సైరా'లో చూపించారు. ఇక ఎమోషన్స్‌కి తగ్గట్టుగా అమిత్ త్రివేది ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుడి మనసును పిండేస్తుందట.
సినిమా చూసి ధియేటర్ నుండి బయటికి వచ్చే ప్రతీ ఒక్కరిలోనూ దేశభక్తి ఫుల్‌గా నిండిపోతుందని దర్శకుడు చెబుతున్నాడు. 'సైరా' కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. అక్టోబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో 'సైరా' ప్రమోషన్స్ టాప్ లేపేస్తున్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో 'సైరా' ప్రమోషన్స్ జరుగుతున్నాయి. బిగ్‌బీ అమితాబ్‌తో సహా, సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ (నయనతార తప్ప) ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.