ఇటీవల హైద్రాబాద్‌లో షూటింగ్ కోసం వేసిన 'సైరా' సెట్ అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెండ్ కారణంగా 'సైరా' షూటింగ్ మరింత ఆలస్యం కానుందట. ఇంతవరకూ జెట్ స్పీడులో సాగిన 'సైరా' షూటింగ్‌కి ఈ యాక్సిడెంట్ బ్రేకులు వేసింది. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో భాగంగా ఈ సెట్‌లోనే మరో 20 రోజులు ఇంపార్టెంట్ సీన్ల చిత్రీకరణ జరగాల్సి ఉంది. కానీ అనుకోని ప్రమాదం కారణంగా సినిమా షూటింగ్ లేట్ అవ్వడం, తద్వారా విడుదల కూడా ఆలస్యమయ్యేలా ఉందని సమాచారమ్.
దసరాకి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ ఇప్పుడు జరిగే పనిలా కనిపించడం లేదు. షూటింగ్ పూర్తి చేసుకున్నాక, విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇంకాస్త టైం పట్టే అవకాశముంది. సో అలా 'సైరా'ని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతికే 'సైరా' ప్రేక్షకుల ముందుకు రానుందనీ తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో అనుష్క కూడా నటించబోతోందంటూ ఈ మధ్య వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే త్వరలోనే అనుష్క 'సైరా' టీమ్‌లో జాయిన్ అవ్వనుందనీ తెలుస్తోంది.
అనుష్క క్యారెక్టర్ యాడ్ అవ్వడంతో సైరాకి మరింత గ్లామర్ యాడ్ అయినట్లైంది. అయితే అనుష్క పాత్ర ఏంటనే విషయంలో చర్చ జరుగుతోంది. 'బాహుబలి'తో అనుష్క రేంజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ స్థాయికి తగ్గట్లుగానే అనుష్క కోసం 'సైరా'లో పాత్రను డిజైన్ చేశారట సురేందర్ రెడ్డి. ఇప్పటికే బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, తమన్నా వంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నయనతార నరసింహారెడ్డి భార్య అయిన 'సిద్ధమ్మ' పాత్ర పోషిస్తోంది. ఏది ఏమైనా 'సైరా'ని ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ మైలురాయిగా మిగిలిపోయే సినిమాగా రూపొందిస్తున్నారు. అవుట్ పుట్ చూస్తుంటే, 'సైరా' రికార్డులు తిరగ రాయడం ఖాయమని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.