దాదాపు తొమ్మిదేళ్ళ విరామం తర్వాత చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా సాధించిన వసూళ్ళు ఓ ప్రభంజనం. అప్పటిదాకా 'బాహుబలి' మాత్రమే 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా. 'నాన్ బాహుబలి' రికార్డులన్నిటినీ 'ఖైదీ నెంబర్ 150' సినిమా తిరగరాసేసింది. ఇదీ మెగాస్టార్ చిరంజీవి స్టామినా.
ఇప్పుడు 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో మరో ప్రభంజనానికి చిరంజీవి తెరలేపేందుకు సమాయత్తమవుతున్నారు. నేడు చిరంజీవి పుట్టినరోజు కాగా, ఒకరోజు ముందే సెలబ్రేషన్స్‌కి తెరలేపిన కొణిదెల ప్రొడక్షన్స్ 'సైరా' టీజర్‌ని విడుదల చేసింది. గంట గంటకీ ఈ టీజర్‌కి వ్యూస్ పోటెత్తాయి. అత్యంత వేగంగా 1 మిలియన్.. అంతే వేగంతో 5 మిలియన్ వ్యూస్ దాటేసిన 'సైరా నరసింహారెడ్డి' టీజర్, ఇప్పటికే 11 మిలియన్ వ్యూస్ దాటేయడం గమనించాల్సిన అంశం.
ఈ జోరు ఇంకా తగ్గడంలేదు. ఇప్పట్లో తగ్గేలా కూడా కన్పించడంలేదు. టీజర్‌లో ప్రతి ఫ్రేమ్ మీదా అభిమానులు విశ్లేషణలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసేస్తున్నారు. ఇంకో వైపు టీజర్ చూసిన జోష్‌లో ట్రైలర్‌పై అంచనాలు మరింతగా పెంచేసుకుంటున్నారు మెగా అభిమానులు. అయితే ట్రైలర్‌కి ఇంకా చాలా టైమ్ వుంది. మార్చ్ నుంచి మే లోపు 'సైరా నరసింహారెడ్డి' సినిమాని విడుదల చేసే అవకాశం వుంది. ఖచ్చితమైన డేట్ ఎప్పుడన్నది త్వరలో ప్రకటిస్తామని అంటున్నాడు చిత్ర నిర్మాత రామ్ చరణ్ తేజ్.
హీరోగా ఓ వైపు తన సినిమాలతో బిజీగా వుంటూనే, తన తండ్రితో వరుసగా సినిమాలు నిర్మిస్తూ 'తండ్రిని మించిన తనయుడు' అన్పించుకుంటున్నాడు మెగా పవర్ స్టార్.