చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' టీజర్ విడుదలైన నాటి నుండీ ఎవ్వరి నోట విన్నా ఆ టీజర్ మాటే. అంతగా వెంటాడేస్తోంది 'సైరా' టీజర్. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'సైరా' టీజర్ విషయంలో కొందరు మరోలా అభిప్రాయ పడుతున్నారు. సినిమా విడుదలయ్యేది వచ్చే ఏడాది సమ్మర్‌లో. చాలా గ్యాప్ ఉంది. ఈలోగా తొందరపడి టీజర్‌ని విడుదల చేసారేమోనని భావిస్తున్నారు.
కానీ చిరంజీవి పుట్టినరోజుకు అభిమానులకు, ఆయనకు చరణ్ ఇచ్చే గిఫ్ట్ అల్టిమేట్‌గా ఉండాలంటే, అది మెగాస్టార్ మూవీ టీజర్ అయ్యి ఉంటేనే బావుంటుంది. అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుంది ఇటు అభిమానులకైనా, అటు తన ప్రియమైన తండ్రి మెగాస్టార్‌కైనా. ఆ ఆలోచనతోనే చరణ్ ఈ సాహసం చేశాడు. అయితే గ్యాప్ సంగతంటారా? తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత ఓ మామూలు కమర్షియల్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో వచ్చి బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టిన మొనగాడు చిరంజీవి. అలాంటిది చిరంజీవి విషయంలో 'గ్యాప్' అన్న మాటకు అర్ధమే లేదు.
ఆయన సినిమాలపై ఉన్న అంచనాల స్థాయే వేరు. టీజర్ వచ్చాక సినిమాపై ఇంతవరకూ ఉన్న అంచనాలు పదిరెట్లు, వంద రెట్లు కాదు, కాదు, వెయ్యి రెట్టు పెరిగిపోయాయ్. సింపుల్‌గా పవర్‌ఫుల్‌గా, పద్థతిగా అభిమానులు చిరంజీవి నుండి ఏం కోరుకుంటారో అదంతా ఒకటిన్నర నిమిషం టీజర్‌లో చూపించేశారు. బడ్జెట్ గురించి చెప్పను అంటూనే, అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా 'సైరా' రూపొందబోతోందని చరణ్ మాటల్లో చెప్పకనే చెప్పేశాడు.