ఓ సినిమా ట్రైలర్ కోసం ఇంతలా ఎదురు చూస్తారా? అనిపించేలా ఎదురు చూశారు 'సైరా' ట్రైలర్ కోసం. ఈ ఎదురు చూపులు ఏదో ట్రైలర్ కోసం అన్నట్లుగా లేవు. సినిమా కోసమన్నట్లుగా అనిపించాయి. అవును నిజమే.. సినిమానే చూపించేశారు. అభిమానులు ఎదురు చూసిన 'సైరా నరసింహారెడ్డి' ట్రైలర్ వచ్చేసింది. 'సైరా నరసింహారెడ్డి మామూలోడు కాదు.. అతనొక కారణజన్ముడు.. అని బ్యాక్ గ్రౌండ్‌లో బిగ్‌బీ వాయిస్.. సంకెళ్లతో ఓ గుహ నుండి పైకి వస్తున్న నరసింహారెడ్డి.. ట్రైలర్ స్టార్ట్ అయ్యింది.
ఇక స్టార్టింగ్ నుండీ ప్రభంజనమే. 'ఓ సైరా..' అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వెంటాడేస్తుంటే, స్క్రీన్‌పై నరసింహారెడ్డిగా చిరంజీవి నట విశ్వరూపం కళ్లు బయర్లు కమ్మేసేలా చేసింది. 'ఈ నేలపైనే పుట్టాం. ఈ నేలపైనే ప్రాణాలు విడుస్తాం.. నీ కెందుకు కట్టాలిరా శిస్తు..' అంటూ నరసింహారెడ్డి చెప్పిన డైలాగ్, చివరి కోరిక ఏమైనా ఉంటే, సే ఇన్ వన్ సెంటెన్స్ అని అడిగితే.? 'గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్' అని పవర్‌ఫుల్‌గా చిరంజీవి చెప్పిన డైలాగ్ ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరిలోనూ దేశభక్తి పురిగొల్పేలా చేస్తోంది. ఇలాంటివి ఒక్కటేమిటి ట్రైలర్ నిండా చాలా డైలాగులు చొప్పించారు. 'లక్ష్మీ అనే నా పేరు పక్కన నరసింహారెడ్డి అనే మీ పేరుకు చోటివ్వండి చాలు..' అని తమన్నా చెప్పే డైలాగ్, 'ఎప్పుడూ నన్ను విడిచిపెట్టనని మాటివ్వండి..' అని నయనతార చెప్పే డైలాగులు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలుస్తున్నాయి.
అవుకు రాజు సుదీప్, రాముడికి హనుమంతుడి లెక్క అనే డైలాగ్‌తో విజయ్ సేతుపతికి ట్రైలర్‌లో చోటు దక్కాయి. యుద్ధంలో పోరుకు తలపడుతున్న గిరిజన మహిళగా నిహారికపై ఓ షాట్ చూపించారు. ఒళ్లు గగుర్పొడిచేలా యుద్ధ సన్నివేశాలూ, కాస్ట్యూమ్స్, భారీ సెట్టింగులూ, విజువలైజేషన్ అన్నీ దద్దరిల్లిపోతున్నాయి. అవును నరసింహారెడ్డి సామాన్యుడు కాదు.. ఓ ప్రభంజనం, ఓ సంచలనం. ఓ సునామీ. అభిమానులు ఆశించిన దానికన్నా అంతకు మించి అనేలా 'సైరా' ట్రైలర్ ఉంది.