తెలుగు సినీ పరిశ్రమపై ఎడా పెడా విమర్శలు చేసిన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ, 'ఆనందో బ్రహ్మ' సినిమాతో మళ్ళీ తెలుగుతెరపై కొత్త ఎంట్రీ ఇచ్చిందని చెప్పక తప్పదు. ఈ కొత్త రీ-ఎంట్రీ ఆమెకు కొత్త కొత్తగా ఉంటుందని బహుశా ఆమె కూడా ఊహించి ఉండదు. మంచి సక్సెస్ తనకు 'ఆనందో బ్రహ్మ' సినిమాతో దక్కడం పట్ల తాప్సీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతోంది. అయితే గతంలో చేసిన విమర్శల తాలూకు ఎఫెక్ట్ తాప్సీని ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతూనే ఉంది. సక్సెస్ వచ్చాక తెలుగు సినీ పరిశ్రమలో మళ్ళీ వెలిగిపోవాలనే ఆలోచన చేస్తున్న తాప్సీ మాత్రం ఇప్పుడు పూర్తి సంయమనం పాటిస్తోంది. గత వివాదాల్ని తవ్వరాదంటూ మీడియాకి విజ్ఞప్తి చేస్తోంది. కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయనీ, వాటిని బూతద్దంలో చూపించడం తగదని తాప్సీ చెబుతోంది. తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకు అపార గౌరవం ఉందంటున్న తాప్సీ ఇంకా ఎక్కువగా తెలుగు సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించింది. 'ఆనందో బ్రహ్మ' సినిమా ఇచ్చిన సక్సెస్‌తో పట్టలేని ఆనందంతో ఉన్న తనకు పాత వివాదాల్ని గుర్తుచేయడం తగదని మీడియాని కోరుతోంది. ఇంకో వైపున బాలీవుడ్ కోసం బక్కచిక్కిపోయిన తాప్సీ తెలుగు సినీ పరిశ్రమ కోసం కొంచెం బొద్దుగా తయారైతే బావుంటుందనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. తాప్సీ కూడా ఈ మాటతో ఏకీభవించేలానే ఉంది. బొద్దుగా ఉంటే తాను మరింత అందంగా ఉంటానని తాప్సీ చెబుతోంది.