అందాల భామ తాప్సీ ఒకప్పుడు వివాదాలకు దూరంగా ఉండేది. అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ అవకాశాలు దక్కించుకుంది. అందుకే తెలుగులో సరైన సక్సెస్‌లు లేకపోయినా, ఆమె తెలుగులో చాలా సినిమాల్లో నటించేయగలిగింది. బాలీవుడ్‌లోనూ మొదట్లో తాప్సీ ఇలాగే ఉండేది. తమిళంలోనూ అంతే. కానీ ఏమయ్యిందో బాలీవుడ్‌లో సక్సెస్‌లు కొట్టాక తాప్సీలో చాలా మార్పు వచ్చింది. ఎక్కువగా వివాదాలను ఆశ్రయిస్తోంది. మొన్నీమధ్యన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, తగిన మూల్యం చెల్లించుకుంది. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో క్షమాపణ చెప్పింది కూడా. అయితే తాప్సీ ఆగడాలు అక్కడితో ఆగలేదు. సౌత్ సినీ పరిశ్రమను చిన్నచూపు చూస్తూ వ్యాఖ్యలు చేసింది. గ్లామర్‌కి తప్ప సౌత్‌లో నటనకు గుర్తింపు ఉండదని చెప్పి మరోసారి వివాదాల్లోక్కింది. గతంలోనూ ఇదే తరహాలో ఆమె సౌత్ సినిమాపై గుర్రుమంది. తాజాగా హీరోయిన్ల అంద చందాలకు క్రేజ్ ఎక్కువనీ, వాటి మీదనే ఎక్కువమంది దర్శక నిర్మాతలు ఆధారపడి ఉంటారని, ప్రేక్షకులూ అలాగే ఆలోచిస్తారంటూ సౌత్‌తోపాటు, బాలీవుడ్‌పైనా విమర్శలు చేసింది తాప్సీ. అలాగైతే తాప్సీ కూడా ఆ గ్లామర్‌నే నమ్ముకుని అవకాశాలు దక్కించుకుంది కదా. తన అంద చందాలతోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పేరు తెచ్చుకుంది తాప్సీ. ఇప్పుడంటే గ్లామర్ తగ్గించినా గతంలో తాప్సీ చేసినంత అందాల ప్రదర్శన ఇంకెవరూ చేయలేదనడం నిస్సందేహం. తెలుగులో 'ఆనందోబ్రహ్మ' సినిమాతో త్వరలోనే తాప్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది.