కృష్ణ జింకలను వేటాడిన కేసులో కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కి జోధ్‌పూర్ న్యాయస్థానం ఐదేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు అనంతరం ఆయన్ని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన అప్లై చేసిన బెయిల్ దరఖాస్తుపై వాదనలు శనివారానికి వాయిదా వేయడంతో ఈ రోజు కూడా సల్మాన్‌ఖాన్ జైలులోనే గడపాల్సి వుంది.
ఇకపోతే ఇదే కేసులో అనుమానితులుగా ఉన్న సైఫ్ అలీఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలమ్‌లను కోర్టు నిర్దోషులుగా పరిగణించి విడుదల చేసింది. అయితే ఇది తాత్కాలిక ఊరట మాత్రమే. ఈ కేసుకు సంబంధించి ఈ ఐదుగురూ కలిసే ఈ వికృత చర్యకు పాల్పడ్డారు. అయితే ముందు సీట్లో అదీ డ్రైవర్ సీట్లో కూర్చున్న సల్మాన్‌ఖాన్‌ని మాత్రమే అక్కడి గిరిజన వ్యక్తి గుర్తుపట్టాడు. ఆ ప్రత్యక్ష వ్యక్తి సాక్ష్యాధారంతోనే సల్మాన్‌కి శిక్ష విధించింది న్యాయస్థానం. అయితే ఇందులో వెనక సీట్లో కూర్చొని ఉన్న టబు కూడా సల్మాన్‌ని జింకను వేటాడేందుకు రెచ్చగొట్టారంటూ మరో వ్యక్తి చెబుతున్నాడు.
అయితే ఈ సాక్ష్యం పరిగణలోకి తీసుకుంటే టబుకు ఇంకా ముప్పు తప్పలేదనే చెప్పాలి. ఒకవేళ ఇదే సాక్ష్యంతో మరో కేస్ కానీ ఫైల్ చేస్తే, ముద్దుగుమ్మ టబుకు కూడా శిక్ష తప్పదంటున్నారు. ఇక ప్రస్తుతానికి అయితే సైఫ్ ఆలీఖాన్ సహా మిగిలిన వారు సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఇప్పటికైతే కండలవీరుడు దోషిగా నిర్ధారించబడ్డాడు. ఒకవేళ ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగిందంటే, ఇంకా ఎంత దూరం చేరుతుందో చూడాలిక.