ప్రతీవారం బాక్సాఫీసు కొత్త సినిమాలతో కళకళలాడుతోంది. ఒకేసారి నాలుగైదు సినిమాలు వరుస కడుతున్నాయి. అందులో ఆడినవి కొన్నే అయినా - ప్రేక్షకులకు మాత్రం ఆప్షన్స్ ఎక్కువే దొరుకుతున్నాయి. ఈ వారం కూడా సినిమాల హవా ఎక్కువగానే కనిపించింది. అర్జున్ సురవరం, రాజావారు రాణీగారు, రఘుపతి వెంకయ్య నాయుడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకువచ్చాయి. వర్మ సినిమా `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` కూడా రావాల్సింది. సెన్సార్ కారణాల వల్ల విడుదల కాలేదు.
ముందుగా `అర్జున్ సురవరం` గురించి మాట్లాడుకుందాం. `ముద్ర` అనే టైటిల్‌తో పట్టాలెక్కిన ఈ సినిమా ఆ తరవాత అనివార్య కారణాల వల్ల పేరు మార్చుకోవాల్సివచ్చింది. విడుదల కూడా ఆలస్యమైంది. ఎన్నో వాయిదాలు పడిన తరవాత ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ అయితే `ఓకే` అనిపించుకుంది. వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో దాదాపుగా 4.5 కోట్లు తెచ్చుకుంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ రెండూ మంచి రేటు పలికాయి. నిర్మాతలు సేఫ్ అయినట్టే. మీడియా నేపథ్యంలో సాగిన సినిమా ఇది. యువతరానికి కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి. ఓ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ద్వితీయార్థంలో స్క్రీన్ ప్లే ఇంకాస్త పట్టుగా నడిపి ఉంటే ఇంకొంచెం మంచి ఫలితం వచ్చేది.
విడుదలకు ముందే `రాజావారు రాణీగారు` మంచి బజ్ తెచ్చుకుంది. స్టార్లు లేకపోయినా పాటలూ, ప్రచార చిత్రాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా శుక్రవారమే విడుదలైంది. టాక్ కూడా బాగానే ఉంది. సినిమా కాస్త స్లో ఫేజ్‌లో ఉన్నా - వినోదానికి ఢోకా లేకుండా చూసుకున్నారు. టెక్నికల్ టీమ్ బాగా సపోర్ట్ చేసింది. కథగా గమ్మత్తులేం లేవు. కానీ నడిపిన విధానం బాగుంది. మొత్తానికి యావరేజ్‌గా నిలిచింది. బీ, సీ సెంటర్లలో వసూళ్లు ఓ మాదిరిగా ఉన్నాయి. ఈ సినిమా బడ్జెట్‌తో పోలిస్తే.. ఆ వసూళ్లు సరిపోతాయి కూడా. నిర్మాతలు, సినిమా కొనుక్కున్న వాళ్లూ గట్టెక్కినట్టే.
ఈవారమే రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్ కూడా వచ్చింది. నరేష్ ప్రధాన పాత్రధారి. కేవలం అవార్డుల కోసమే తీసిన సినిమా ఇది. అందుకే తక్కువ థియేటర్లలో విడుదలైంది. నరేష్ నటన బాగానే ఉన్నా, డాక్యుమెంటరీ లక్షణాలే ఎక్కువగా కనిపించాయి. మంచి ప్రయత్నమే తప్ప.. లాభదాయకమైన ప్రాజెక్టు ఏమాత్రం కాదు.