భీష్మ తరవాత నితిన్ నుంచి వచ్చిన చిత్రం `చెక్`. భీష్మ సూపర్ హిట్ అయ్యింది. నితిన్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు తెచ్చిన సినిమాగా మారింది. దాంతో.. `చెక్`పై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ఫోకస్ ఏర్పడింది. దాదాపుగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అయితే.. ఈ శుక్రవారం విడుదలైన `చెక్` అని విధాలా నిరాశ పరిచింది.
తొలి రోజు నుంచే డివైట్ టాక్ వచ్చింది. చంద్రశేఖర్ ఏలేటి చేయాల్సిన సినిమా కాదని, క్లైమాక్స్ మరీ వీక్ గా ఉందని విమర్శకులు తేల్చేశారు. దానికి తగ్గట్టే.. ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 3.4 కోట్ల వసూళ్లు రాబట్టుకుంది. భీష్మకి వచ్చిన ఫస్ట్ డే కలక్షన్లతో పోలిస్తే చాలా తక్కువ. శని, ఆది వారాలు సైతం చెక్ వసూళ్లు నిరాశ పరిచాయి. మూడు రోజులకు కలిపి 6 కోట్ల వరకూ రాబట్టిందని తెలుస్తోంది. అంటే.. మరో 10 కోట్లు రావాలన్నమాట.
అది అంత ఈజీ కాదని అర్థమైపోతోంది. ఎంతో అద్భుతం జరిగితే తప్ప... భీష్మ బయ్యర్లు నష్టాల నుంచి బయటపడే ఛాన్స్ లేదు. ఈ సినిమా ప్రభావం నితిన్ నుంచి రాబోయే `రంగ్ దే`పై పడే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది.