2018 ముగింపుకి వచ్చేశాం. అందుకే... వీలైనన్ని ఎక్కువ సినిమాలు విడుదల చేసి 'డబ్బాలు దులిపేద్దాం' అని ఆలోచిస్తోంది చిత్రసీమ. అందుకు తగినట్టుగానే సినిమాలు కూడా వరుస కడుతున్నాయి. డిసెంబరు 7న ఎన్నికల హంగామా ఉన్నా - సినిమావాళ్లు ఏమాత్రం తగ్గలేదు. శుక్రవారం ఏకంగా 4 సినిమాలు విడుదల చేసి 'ఎలక్షన్లతో మాకేం భయం లేదు' అనే విషయాన్ని చాటి చెప్పింది. 'కవచం', 'సుబ్రహ్మణ్యపురం', 'నెక్ట్స్ ఏంటి', 'శుభలేఖలు' ప్రేక్షకుల ముందుకు వచ్చి, అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.
ముందుగా 'కవచం' విషయానికొస్తే... బెల్లంకొండ సాయి శ్రీనివాస్- కాజల్ జంటగా నటించిన చిత్రమిది. బెల్లంకొండ తొలిసారి ఓ పోలీస్ కథని ఎంచుకున్నాడు. ట్విస్టులు బాగానే ఉన్నా- దర్శకుడు వాటిని తెరపైకి తీసుకొచ్చే విధానంలో తేడా కొట్టేసిందన్నది విశ్లేషకుల మాట. విజువల్ గా గ్రాండ్ లుక్ ఉన్నా, అతి ముఖ్యమైన కథనం విషయంలో ఈ సినిమా బాగా ఇబ్బంది పెట్టింది. కాజల్ స్టార్‌డమ్, ఆమెకున్న క్రేజ్ ఈసినిమాని గట్టెక్కించలేకపోయింది. కాకపోతే... ఈ శుక్రవారం విడుదలైన నాలుగు సినిమాల్లో వసూళ్ల పరంగా ముందంజలో ఉంది. శాటిలైట్, డిజిటల్ రూపంలో... మంచి డబ్బులే వచ్చాయి. వారాంతంలో ఎంత సాధించిందన్నదానిబట్టి ఈ సినిమా రేంజ్ ఆధారపడింది.
'మళ్లీ రావా' తో ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించిన సుమంత్.. 'సుబ్రహ్మణ్యపురం'తో నిరాశ పరిచాడు. ఇదో థ్రిల్లర్. ద్వితీయార్థం కాస్త బగానేఉన్నట్టు అనిపించింనా... తొలిసగం డల్‌గా ఉండడం, సెకండాఫ్‌లో ట్విస్టుల్ని రివీల్ చేసే విధానం సవ్యవంగా లేకపోవడంతో 'సుబ్రహ్మణ్యపురం' అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోయింది. క్వాలిటీ పరంగానూ ఈ సినిమా బాగా నిరాశ పరిచింది. టీవీ సీరియల్ తరహా మేకింగ్ తో.. నిర్మాణ పరమైన లోపాలు బహిర్గతమయ్యాయి.
టాలీవుడ్‌లోని అగ్ర కథానాయికల్లో తమన్నాకి తప్పకుండా స్థానం ఉంటుంది. తన నుంచి ఓ సినిమా వస్తోందంటే ఆసక్తి మొదలవ్వడం సహజం. 'నెక్ట్స్ ఏంటి' కూడా అలానే ఫోకస్ లోకి వచ్చింది. ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా.. తగినంత ప్రచారం చేయకుండానే హడావుడిగా వచ్చేసింది ఈ సినిమా. ఫలితం కూడా ఆ స్థాయిలోనే ఉంది. నవతరం అభిప్రాయాల్ని మేళవించి రాసుకున్న కథ ఇది. అయితే... మేకింగూ, టేకింగూ వాళ్లకు నచ్చినట్టు లేకపోవడం అతి పెద్ద మైనస్. దర్శకుడి లక్ష్యమేంటో సామాన్య ప్రేక్షకులకు అర్థం కానంత గందరగోళంగా ఈ సినిమా తయారైంది. వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే సాగాయి.
ఈ మూడు సినిమాలతో పాటు విడుదలైన మరో సినిమా 'శుభలేఖలు+లు'. టైటిల్‌లో ఉన్న ఆ కొత్తదనం కథ, కథనాల్లో లేకపోవడంతో ప్రేక్షకులు తిప్పి కొట్టారు. రెండు గంటల సినిమాలో ఆసక్తికరమైన, ఆకట్టుకునే సన్నివేశం ఒక్కటీ లేకపోవడంతో.. టికెట్ కొన్న ప్రేక్షకుడికి శిరోభారం ఒక్కటే మిగిలింది.