మినిమం గ్యారెంటీ హీరో - అనే క్రేజ్ సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. తన సినిమా అంటే - ఎలా ఉన్నా సరే చూడ్డానికి ఓ ప్రేక్షక వర్గం రెడీగా ఉంటుంది. అందుకే నాని సినిమాలకు విడుదలకు ముందే బిజినెస్ అయిపోతుంది. నిర్మాతలు సేఫ్‌గా ఉంటారు. మంచి ఓపెనింగ్స్ వస్తాయి కాబట్టి బయ్యర్లు కూడా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోతారు. అందుకే.. నాని సినిమాల బిజినెస్‌లకు ఎలాంటి ఢోకా ఉండదు.
గ్యాంగ్ లీడర్ కూడా మంచి బిజినెస్ జరుపుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 22 కోట్లకు ఈ సినిమా అమ్ముడైంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలుపుకుంటే మరో పది కోట్టు వచ్చాయి. అలా గ్యాంగ్ లీడర్ కమర్షియల్ పరంగా మంచి ప్రాజెక్టు అయ్యింది. అయితే బాక్సాఫీసు రిజల్ట్ చూస్తే.. కాస్త ఇబ్బందికరంగానే అనిపిస్తోంది. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. విక్రమ్ కె.కుమార్ స్థాయిలో ఈ సినిమా లేదని విశ్లేషకులు తేల్చేశారు. సెకండాఫ్ సరిగా కుదరలేదని, లాజిక్కులు వదిలేశాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రేక్షకులు ఇవేం పట్టించుకోకుండా తొలి రోజు 4.5 కోట్లు కట్టబెట్టారు. రెండో రోజు మరో 3.3 కోట్లు వచ్చాయి.
ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగే అవకాశాలున్నాయి. సోమవారం నుంచి వసూళ్లు ఎలా ఉంటాయన్నదాన్ని బట్టే గ్యాంగ్ లీడర్ ఫలితం ఆధారపడి ఉంది. వచ్చేవారం వాల్మీకి రెడీ అవుతోంది. దానిపైనా చాలా అంచనాలున్నాయి. అయితే విడుదలకు ముందు వాల్మీకి కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ మార్చమని ఓ వర్గం గొడవ చేస్తోంది. మరి ఆ సమస్య నుంచి వాల్మీకి ఎలా దాటుకుని వస్తాడో చూడాలి.