ఈ దీపావళికి తమిళ టపాసులే దిక్కయ్యాయి. అటు కార్తి, ఇటు విజయ్ సినిమాలు బాక్సాఫీసు దగ్గర సందడి చేశాయి. కార్తి 'ఖైదీ' అవతారం ఎత్తాడు. విజయ్ 'విజిల్' వేశాడు. ఈ రెండు సినిమాలతో పాటు బిత్తిరి సత్తి హీరోగా నటించిన 'తుపాకీ రాముడు' కూడా ఈ వారమే విడుదలైంది. విజయ్ నటించిన విజయ్.. మాస్‌కి నచ్చేలా తయారైంది. ఇదో పక్కా కమర్షియల్ సినిమా. దానికి క్రీడా నేపథ్యాన్ని ఎంచుకున్నారు. దర్శకుడు అట్లీ ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయగలిగాడు. విజయ్ అభిమానులకు నచ్చేలా సన్నివేశాల్ని పేర్చుకుంటూ వెళ్లాడు. దాంతో పాటు తాను చెప్పాల్సిన విషయాన్ని కమర్షియల్ సూత్రాల్ని రంగరించి చెప్పాడు. దాంతో... 'విజిల్' అందరికీ నచ్చేలా తయారైంది. విజయ్ సినిమాలకు తమిళంలో తిరుగుండదు. అక్కడ ఈ సినిమా కొత్త రికార్డులు లిఖించబోతోందని ట్రేడ్ వర్గాలు ముందే అంచనా వేశాయి. తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బీ, సీ సెంటర్లలో విజిల్ హవా చూపించొచ్చు. ఈ సినిమాని దాదాపు 6 కోట్లకు కొనుగోలు చేశారు తెలుగు నిర్మాతలు. అవన్నీ తొలి మూడు రోజుల్లోనే రాబట్టుకునే అవకాశాలున్నాయి.
కార్తీకి ఓ హిట్టు పడి చాలా కాలం అయ్యింది. తాను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంటున్నాయి. ఈనేపథ్యంలో విడుదలైన `ఖైదీ` కార్తీ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. ఇదో రియలిస్టిక్ డ్రామా. సినిమా అంతా యాక్షన్ మూడ్‌లోనే సాగుతుంది. సీటు అంచున కూర్చోబెట్టగలిగే థ్రిల్లింగ్ అంశాలతో సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. కార్తి నటన కూడా అత్యంత సహజంగా ఉంది. పాటలు, రొమాన్స్ లేకుండా కేవలం కథనే చెప్పాలన్న ప్రయత్నం అభినందించదగినది. తమిళంలో ఇప్పటికే పెద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ విమర్శకులు ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వసూళ్లు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. విజిల్‌తో పోలిస్తే.. కలక్షన్లు తగ్గినట్టు అనిపించినా, తన స్థాయికి తగిన వసూళ్లని అందుకుంటోంది. తెలుగు హక్కులు కొనుక్కున్నవాళ్లు కచ్చితంగా లాభాలు చవిచూసే అవకాశాలున్నాయి.
బుల్లి తెర ద్వారా అభిమానుల్ని సంపాదించుకున్నాడు బిత్తిరి సత్తి. హాస్య నటుడిగా కొన్ని సినిమాల్లోనూ నటించాడు. ఇప్పుడు తుపాకీ రాముడుతో హీరోగా అవతారం ఎత్తాడు. ఇదో సరదా సినిమా. తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది. అయితే సరైన పబ్లిసిటీ దొరకలేదు. రెండు డబ్బింగ్ సినిమాల మధ్య నలిగిపోయింది. పైగా టాక్ కూడా అంతంతమాత్రమే. ఈ వారం విజిల్, ఖైదీ స్పష్టమైన విజేతలుగా నిలిచారు. డబ్బింగ్ సినిమాలే అయినా, తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ వీటిలో ఉన్నాయి.