వారం వారం బాక్సాఫీసు దగ్గర సినిమాల తాకిడి ఎక్కువవుతూనే ఉంది. అయితే తెలుగు సినిమాకి కావల్సిన `హిట్టు` మాత్రం దక్కడం లేదు. టికెట్లు తెంపి, హౌస్ ఫుల్ బోర్డు కనిపించేలా సినిమాలేం రావడం లేదు. సినిమాకి వెళ్లాలన్న ఆలోచన, ఆసక్తి కూడా ప్రేక్షకులకు తగ్గుతోంది. వరల్డ్ కప్ ఫీవర్ కూడా ఉంది కదా. ఆ ప్రభావం కూడా సినిమాపై పడింది. అయితే.. ఈ వారం మాత్రం కాస్త ఉపశమనం కలిగించేలా ఫలితాలొచ్చాయి. ఓ చిన్న సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కుతోంటే, మరో చిన్న సినిమా `హిట్` టాక్ తెచ్చుకుంది.
మరో రెండు సినిమాలు మాత్రం యధావిధిగా బోల్తా పడ్డాయి. అవేంటంటే.. ఈవారం విడుదలైన సినిమాల్లో `మల్లేశం` ఒకటి. చింతకింది మల్లేశం అనే ఓ చేనేత కార్మికుడి జీవిత కథ ఇది ఆసు యంత్రం కనుక్కోవడానికి తను చేసిన ఫలితాల సమాహారం. ఓ రకంగా బయోపిక్. దాన్ని హృద్యంగా వెండి తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు రాజ్. తెలంగాణ నేటివిటీని తెరపై చాలా అద్భుతంగా పండించగలిగాడు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం అందడంతో దర్శకుడి ప్రయత్నం సఫలీకృతమైంది. హాస్య నటుడు ప్రియదర్శిలోనూ, యాంకర్ ఝాన్సీలోనూ ఇంత మంచి నటన ఉందా? అనే ఆశ్చర్యం కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు ఈ చిత్రానికి అందాల్సివుంది. కాకపోతే... బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా గట్టెక్కడం కష్టం.
డాక్యుమెంటరీ లక్షణాలు కనిపించండంతో రెగ్యులర్ ఆడియన్స్ ఈ సినిమాకి దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఇక చంటబ్బాయ్‌లా నవ్వించి కవ్వించడంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ విజయవంతం అయ్యాడు. డిటెక్టీవ్ సినిమాలు వచ్చి చాలా కాలమైంది. అయితే సీరియస్ విషయాన్ని చాలా అందంగా, నవ్విస్తూ చెప్పాడు ఈ ఆత్రేయ. నటీనటులు, సాంకేతిక నిపుణులంతా కొత్తవారే. కాకపోతే ఏంటి?? థియేటర్లలో నవ్వుల జల్లులు కురుస్తున్నాయి. కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన నవీన్‌కు మంచి భవిష్యత్తు ఉంది. దర్శకుడికీ ఛాన్సులు వచ్చే అవకాశాలున్నాయి. వసూళ్ల పరంగానూ ఈ సినిమాకి మంచి ఫలితాలొస్తున్నాయి. విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. చిన్న సినిమాల్లో మరో హిట్టు సినిమా వచ్చేసినట్టే. విడుదలకు ముందు అనేక అడ్డంకులు ఎదుర్కున్న సినిమా ఓటర్. మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది. నిర్మాతకూ, హీరోకూ, దర్శకుడికీ మధ్య గొడవలు తలెత్తడంతో వ్యవహార కోర్టు వరకూ వెళ్లింది. ఇప్పుడు అవన్నీక్లియర్ అయి సినిమా వచ్చింది.
కానీ లాభం లేకుండా పోయింది. అవుడ్డేటెడ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకి ప్రేక్షకుల మద్దతు కరువైంది. విష్ణు సినిమాలకు డిమాండ్ ఎప్పుడో పడిపోయింది. ఇప్పుడు ఈ సినిమాతో ఆ విషయం మరోసారి తేటతెల్లమైంది. చాలా థియేటర్లలో విడుదల చేసినా ఒక్కచోట కూడా 30 శాతానికి మించి ఆక్యుపెన్సీ రాలేదు. దాని కంటే చిన్న సినిమాలైన `ఏజెంట్`, `ఫస్ట్ ర్యాంక్ రాజు`లే ఎక్కువ వసూళ్లు చేశాయంటే ఈ సినిమా ఫలితాన్ని అంచనా వేయొచ్చు. ఇక `ఫస్ట్ ర్యాంక్ రాజు` కూడా నిరాశే కలిగించింది. ప్రచార చిత్రాల్లో కనిపించే కామెడీ కూడా తెరపై పండలేదు. ద్వితీయార్థం అయితే మరింత బోరింగ్‌గా సాగింది. నాయకా నాయికల ప్రదర్శన కూడా పేలవం. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నాలుగు సినిమాలు వచ్చినా వసూళ్లు మాత్రం `ఏజెంట్`కే దక్కుతున్నాయి. బాక్సాఫీసు దగ్గర హోరూ, జోరూ ఈ వారం కూడా కనిపించలేదు. వచ్చే వారం ఏమైనా అలాంటి అవకాశం వస్తుందేమో చూడాలి.