2019కి వీడ్కోలుపలుకుతూ, 2020కి ఘన స్వాగతం అందించే తరుణం ఇది. ఈ యేడాది చివరి వారంలోనూ కొత్త సినిమాల జోరు కనిపించింది. ఈవారం మూడు సినిమాలొచ్చాయి. అవే...మత్తువదలరా, ఇద్దరి లోకం ఒకటే, సాఫ్ట్ వేర్ సుధీర్. మరి ఈ సినిమాల జాతకం ఏమిటి? చివరి వారం ఎలా గడిచింది?
డిసెంబరు 25 క్రిస్మస్‌సెలవుని క్యాష్ చేసుకుందామన్న ఉద్దేశంతో రెండు సినిమాలొచ్చాయి. దిల్ రాజు ప్రొడక్షన్ లో, రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన ఇద్దరి లోకం ఒకటే బుధవారం విడుదలైంది. రాజ్ తరుణ్ ఫ్లాపుల పరంపరని ఈ సినిమా కూడా కొనసాగించింది. నీరసమైన కథ, పేలవమైన స్క్రీన్ ప్లే తో దర్శకుడు ప్రేక్షకుల్ని బోర్ కొట్టించాడు. మిక్కీ పాటలు బాగున్నా, కథలో లోపం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఓ టర్కీష్ సినిమా ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. క్లైమాక్స్‌ని మినహాయిస్తే, ఎక్కడా కొత్తదనం కనిపించలేదు. దాంతో రాజ్ తరుణ్ ఖాతాలోకి మరో ఫ్లాప్‌చేరినట్టైంది. ఈ సినిమా వసూళ్లు కూడా దారుణంగా ఉన్నాయి.
కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా పరిచయం అయిన చిత్రం `మత్తు వదలరా`. మరో తనయుడు కాలభైరవ సంగీతం అందించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. ఈ సినిమాకి మంచి అప్లాజే వచ్చింది. దర్శకుడు కొత్త పాయింట్‌ని పట్టుకుని, విభిన్నమైన స్క్రీన్ ప్లేతో అలరించాడు. సత్య అందించిన కామెడీ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. టాక్ బాగున్నా, వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే 2 కోట్లతో పూర్తి చేసిన సినిమా ఇది. కాబట్టి - నిర్మాతలు ఈజీగా గట్టెక్కేస్తారు.
ఇక ఈ యేడాది చివరి సినిమాగా విడుదలైంది.. సాఫ్ట్ వేర్ సుధీర్. జబర్‌దస్త్ తో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ధన్య బాలకృష్ణ కథానాయిక. ఈ సినిమాని పట్టించుకున్న నాధుడే లేడు. థియేటర్లు కూడా తక్కువగానే దొరికాయి. అక్కడక్కడ కొన్ని నవ్వుల్ని పంచిన ఈ సినిమా.. మొత్తంగా చూస్తే నిరాశ పరిచింది. గత వారం విడుదలైన ప్రతీరోజూ పండగే ఈవారం కూడా బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లే అందుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇప్పటికీ అదే మంచి ఆప్షన్.