ఈమధ్య టాలీవుడ్ వరుస విజయాలతో కళకళలాడుతోంది. చిన్న సినిమాలు బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాల్ని రాబడుతున్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయాయి. ఈవారం రెండు సినిమాలు వచ్చాయి. `ఓ బేబీ`, `బుర్ర కథ` బాక్సాఫీసు దగ్గర సందడి చేశాయి. మరి వీటి జాతకం ఏమిటి? గత వారం ఫామ్‌ని కొనసాగించిన సినిమా ఏమిటి? ఈ వారం రెండు సినిమాలున్నా, అందరి దృష్టీ `ఓ బేబీ`పైనే. ముందు నుంచే ఈ సినిమా పాజిటీవ్ టాక్‌ని ముటగట్టుకుంది. ప్రచార చిత్రాలు సైతం ఆకట్టుకోవడంతో `ఓ బేబీ`పై ఫోకస్ పెరిగింది. దానికి తగ్గట్టుగానే బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టింది ఓ బేబీ.
అటు విమర్శకుల ప్రశంసలు, ఇటు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుని `హిట్` చిత్రాల జాబితాలో చేరిపోయింది. సమంత నటన, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్‌ల సహకారం, సాంకేతిక నిపుణుల ప్రతిభ వెరసి ఈ సినిమాని నిలబెట్టాయి. సోలో హీరోయిన్‌గా సమంతకు అత్యంత కీలకమైన విజయమిది. ఈ హిట్‌తో.. సమంత చేతికి మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. తొలి రెండు రోజులూ... వసూళ్ల పరంగానూ ఓ బేబీ ఆకట్టుకుంది. ఈ దూకుడు చూస్తే.. రూ.10 కోట్ల మైలు రాయిని సులభంగా దాటేస్తుందన్న నమ్మకం కలుగుతోంది.
ఇక ఈ వారమే విడులైన మరో చిత్రం `బుర్ర కథ`. రచయిత డైమండ్ రత్నబాబు తొలిసారి మెగాఫోన్ పట్టాడు. ఆది కథానాయకుడిగా నటించాడు. ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండడంతో ఆది ఈసారైనా హిట్ కొడతాడనిపించింది. అయితే ఆ ఆశలన్నీ ఆవిరి అయిపోయాయి. లైన్ బాగున్నా దాన్ని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. రొటీన్ స్క్రీన్ ప్లే, అర్థం పర్థం లేని కామెడీ సీన్లతో విసుగెత్తించాడు.
ఓ బేబీ పక్కన ఈ సినిమా మరింత చిన్నదైపోయింది. విమర్శకులు సైతం ఈ సినిమాని చీల్చి చెండాడుతున్నారు. విడుదలు ముందున్న బజ్‌తో.. కాస్తో కూస్తో వ్యాపారం చేయగలిగింది. శాటిలైట్, డిజిటల్ హక్కులు అమ్ముడుపోవడంతో నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ వారం హాలీవుడ్ చిత్రం స్పైడర్‌మాన్ కూడా విడుదలైంది. మల్టీప్లెక్స్ వసూళ్లకు స్పైడర్ మాన్ కాస్త అడ్డుతగిలింది. లేదంటే ఓ బేబీకి మరిన్ని మంచి వసూళ్లు దక్కేవి.