ఇద్దరు హీరోల కెరీర్‌కి ఈ వారం... చాలా కీలకంగా మారింది. ఈ సినిమాతో వాళ్లు నిరూపించుకుంటే సరే. లేదంటే.. కెరీర్ అల్లకల్లోలం అయ్యే పరిస్థితులొచ్చాయి. ఆ ఇద్దరు హీరోలే... బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కార్తికేయ. వీరిద్దరి సినిమాలు ఈ వారం విడుదలయ్యాయి. అవే... రాక్షసుడు, గుణ 369.
ఈ రెండు చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇంతకీ ఈ హీరోలు గట్టెక్కారా? బాక్సాఫీసు రిపోర్టు ఎలా ఉంది? రివ్యూలు ఎలా వచ్చాయి....? ముందుగా 'రాక్షసుడు' గురించి చెప్పుకోవాలి. తమిళ 'రాక్షసన్'కి ఇది రీమేక్. బెల్లంకొండ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. వరుస ఫ్లాపుల మధ్య బెల్లంకొండకు ఈ సినిమా రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి.
ఈమధ్య కాలంలో రీమేకులు వర్కవుట్ అవ్వడం లేదు. థ్రిల్లర్ చిత్రాలు చూసీ చూసీ జనాలకూ బోర్ కొట్టేసింది. అయితే... రాక్షసన్ ని తెలుగులో సరైన రీతిలో రీమేక్ చేయడంలో చిత్రబృందం విజయవంతమైంది. మాతృకని మక్కీకి మక్కీ ఫాలో అవ్వడంలో విజయవంతమైన చిత్రబృందం... ఆ ఆత్మని పట్టుకోవడంలో కూడా ఎక్కడా పొరపాటు చేయలేదు. దాంతో.. ఓ తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడేవాళ్లకు రాక్షసుడు మంచి ఆప్షన్.
బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తన వంతు పాత్రకు న్యాయం చేశాడు. తన కెరీర్‌కి ఈ సినిమా బూస్టప్ అవుతుంది. శుక్ర, శనివారాలు వర్షాల ప్రభావంతో వసూళ్లు ఆశించినంత గొప్పగా లేవు. అయితే.. ఆదివారం బాగా కోలుకున్నాయి. చాలా రోజుల తరవాత బెల్లంకొండ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. ఇక... 'గుణ 369' గురించి చెప్పుకోవాలి.
ఆర్.ఎక్స్ 100తో ఒక్కసారిగా తుఫానులా విరుచుకుపడ్డాడు కార్తికేయ. ఆ సినిమాతో ఒక్కసారిగా నాలుగైదు ఆఫర్లు వచ్చి పడ్డాయి. స్టార్‌గా ఎదిగే ఛాన్సులు కార్తికేయకు ఉన్నాయనిపించింది. కానీ... రెండో సినిమా హిప్పీతో బోల్తా పడ్డాడు. మూడో సినిమాని ఎలాగైనా హిట్టు చేసుకోవాల్సిన పరిస్థితులు కల్పించుకున్నాడు. ఈ దశలో గుణ 369 వచ్చేసింది. ఆర్.ఎక్స్ 100లా అందరినీ ఆకట్టుకునే సినిమా కాదిది.
అలాగని.. హిప్పీలా నిరాశ పరచదు. యావరేజ్ గా మిగిలిపోతుంది. విశ్రాంతి ఘట్టం, పతాక సన్నివేశాలు ఈ సినిమాకి బలం. మధ్య సాగిన డ్రామా అంతా నీరసంగా ఉండడంతో.. మంచి హిట్టయ్యే అవకాశాన్ని కోల్పోయింది. అయితే బీ,సీలలో మాత్రం వసూళ్లు బాగానే ఉన్నాయి. అవెంత నిలకడగా ఉంటాయన్నది పెద్ద ప్రశ్న. ఈవారం విడుదలైన రెండు సినిమాల్లో ఎక్కువ మార్కులు రాక్షసుడుకే పడతాయి. కాస్త నిలబడే అవకాశాలు దానికే ఉన్నాయి. మాస్‌కి మాత్రం గుణ మంచి ఛాయిసే. కాకపోతే.. విశ్రాంతి వరకూ ఈ సినిమా చూసేంత ఓపిక వాళ్లకుండాలి.