దేశ వ్యాప్తంగా సినీ అభిమానుల్ని ఆకర్షించిన చిత్రం సాహో. అందుకు చాలా కారణాలున్నాయి. దాదాపుగా 350 కోట్లతో తెరకెక్కించిన చిత్రమిది. బాహుబలి తరవాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా. పాన్ ఇండియా బ్రాండ్‌తో దేశ వ్యాప్తంగా ఈ సినిమాని అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు. సాహోకి భయపడి చాలా సినిమాలు రిలీజ్ డేట్ మార్చుకున్నాయి.
హాలీవుడ్ సినిమాల్ని తలదన్నేలా యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందించారని ప్రచారం సాగింది. దాంతో సాహోపై అంచనాలు భారీగా పెరిగాయి. వాటన్నింటినీ మోసుకుంటూ సాహో విడుదలైంది. బాహుబలి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టింది. నాన్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా... బాహుబలికి జై కొట్టారు. కానీ సాహోకి విభిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి.
ఈ సినిమాకు సరైన రివ్యూలు రాలేదు. దర్శకుడు అన్ని రంగాల్లోనూ విఫలం అయ్యాడని, యాక్షన్ హంగామా, ఖర్చు తప్ప ఇంకేం కనిపించలేదని తేల్చేశారు. ట్విస్టులు ఆసక్తికరంగా లేవని, ఓ హాలీవుడ్ సినిమాకి ఇది ఫ్రీమేక్ అని బోలెడు తప్పుల్ని వేలెత్తి చూపించారు. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ సైతం సాహో చూసి పెదవి విరిచారు. ఈ సినిమాపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. రివ్యూలు, ట్రోల్స్ తో నెగిటీవ్ పబ్లిసిటీ పేరుకుపోయింది. కాకపోతే తొలి రోజు బాక్సాఫీసు దిమ్మతిరిగేలా వసూళ్లు వచ్చాయి.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 130 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాదాపుగా అన్ని చోట్లా నాన్ బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టింది. నైజాంలో అయితే బాహుబలి రికార్డు చెరిగిపోయింది. ఓవర్సీస్‌లో మాత్రం సాహో జోరు కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. నిజానికి సాహో ఈ స్థాయిలో ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందని అందరూ ఊహించారు. ఆ క్రేజ్ అలాంటిది. పైగా టికెట్టు రేట్లు కూడా అమాంతంగా పెంచేశారు. స్క్రీనింగులు కూడా పెరిగాయి. అలా.. సాహోకి తొలిరోజు కలిసొచ్చింది.
శనివారం మరీ ఈ స్థాయిలో వసూళ్లు లేవు గానీ.. అమాంతంగా మాత్రం పడిపోలేదు. ఆదివారం, సోమవారం సాహో వసూళ్లు ఎలా ఉంటాయన్నదాన్ని బట్టి - సాహో ఆర్థిక పరిస్థితి ఏమిటన్నది తేలుతుంది. సాహోకి భయపడి... వచ్చే వారం సినిమాల్ని వాయిదా వేసుకున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూసి వచ్చే శుక్రవారానికి కొన్ని సినిమాలు రెడీ చేయాలని చూస్తున్నారు. 13న గ్యాంగ్ లీడర్ వస్తోంది. 20న వాల్మీకి విడుదల అవుతుంది. ఈ నెలంతా కొత్త సినిమా కబుర్లే వినిపించనున్నాయి.