డబ్బింగ్ బొమ్మ అయినా, కొత్త వాళ్లతో చేసిన ప్రయోగమైనా - నచ్చితే చాలు. నెత్తిమీద పెట్టుకుంటారు తెలుగు ప్రేక్షకులు. స్టార్లు లేకపోయినా ఆదరిస్తారు. అందుకే టాలీవుడ్ అంటే మిగిలిన భాషలకు అంత మక్కువ. తెలుగు నాట డబ్బింగ్ సినిమాలు పోటీ పడడానికి కారణం అదే. ఈసారి కూడా ఓ తెలుగు సినిమాతో రెండు డబ్బింగ్ బొమ్మలు ఢీ కొట్టాయి. మరి వాటి ఫలితం ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులు ఎవరికి జేజేలు పలికారు? ఈవారం తెనాలి రామకృష్ణ బి.ఏ బిఎల్, యాక్షన్, విజయ్ సేతుపతి చిత్రాలు విడుదలయ్యాయి. తెనాలి రామకృష్ణ తెలుగు సినిమా అయితే, మిగిలినవి రెండూ డబ్బింగ్‌లే.
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'తెనాలి రామకృష్ణ బిఏబిఎల్'. హన్సిక కథానాయికగా నటించింది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి సానుకూల స్పందనేం రాలేదు. ముతక కథ, కథనాలని విశ్లేషకులు తేల్చేశారు. ప్రేక్షకుల తీర్పు కూడా అదే. అయితే సీ సెంటర్లలో కాస్త మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. అక్కడ వసూళ్లు బాగానే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే... రికవరీ అవ్వడం మాత్రం కష్టం. అద్భుతాలు జరిగితే తప్ప, బయ్యర్లకు డబ్బులు తిరిగిరావు. విశాల్ 'యాక్షన్' కూడా ఈవారమే వచ్చింది. విశాల్, తమన్నా జంటగా నటించారు. పేరుకు తగ్గట్టే యాక్షన్‌కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. ఆ సన్నివేశాలన్నీ బాగానే వచ్చాయి. దాంతో యావరేజ్‌గా నిలిచింది. బీ, సీలలో మంచి వసూళ్లే వస్తున్నాయి. తెలుగులో ఈ సినిమాని 5 కోట్లకు కొన్నట్టు తెలుస్తోంది. ఆడబ్బులు రావడం కష్టమే. కాకపోతే.. మిగిలిన రెండు సినిమాలతో పోలిస్తే. యాక్షన్‌కే బెటర్ రిజల్ట్ వచ్చినట్టు.
ఇక విజయ్ సేతుపతి పరిస్థితి దారుణంగా ఉంది. తమిళంలో విజయ్ సేతుపతి పెద్ద స్టార్. తెలుగులోనూ సినిమాలు చేస్తున్నాడు. అందుకే తన పేరుమీద వచ్చిన సినిమాని అదే పేరుతో విడుదల చేశారు. కానీ.. తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని లైట్ తీసుకున్నారు. సినిమా కూడా దానికి తగ్గట్టుగానే ఉంది.