ప్రతీవారంలానే ఈ వారం కూడా బాక్సాఫీసు కొత్త సినిమాలతో కళకళలాడింది. గురువారం రెండు, శుక్రవారం ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో రెండు సినిమాలు అటెన్షన్ క్రియేట్ చేసినవే. గురువారం అమ్మరాజ్యంలో కడపబిడ్డలు, మమాంగం విడుదలైతే, శుక్రవారం వెంకీ మామ సందడి చేశాయి.
వర్మ సినిమా అనగానే ఎప్పుడూ ఓ ఆసక్తి నెలకుంటుంది. ఈసారి అది కాస్త ఎక్కువైంది. విడుదలకు ముందు వివాదాలు రేకెత్తించిన అమ్మరాజ్యంలో - ఆ స్థాయిలో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించలేకపోయిందనే చెప్పాలి. ఈసారి పొలిటికల్ సెటైర్‌ని ఎంచుకున్న వర్మ - దాదాపుగా మన రాజకీయ నేతల్ని అందరినీ వాడేసుకున్నాడు. అలాగని సంచలన నిజాల్ని ఏమీ బయటపెట్టలేదు. వాస్తవ పాత్రల్ని ఆధారంగా చేసుకుని, కల్పిత కథని అల్లుకున్నాడు. మేకింగ్‌లో, టేకింగులో మరీ తీసికట్టు ధోరణి పాటించడం వల్ల - ఈ సినిమా విమర్శకుల్ని మెప్పించలేకపోయింది. తెలంగాణలో ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. ఏపీలో కొన్ని చోట్ల... థియేటర్లో జనాలు కనపడ్డారు. మొత్తానికి వర్మ నుంచి వచ్చిన మరో సాధారణమైనచిత్రంగా నిలిచిపోయింది.
మమ్ముట్టి నటించిన అనువాద చిత్రం మమాంగం. గీతా ఆర్ట్స్ ద్వారా ఈ సినిమా విడుదల అవ్వడం వల్ల.. కాస్తో కూస్తో జనాల్ని ఆకర్షిస్తుంది, ఇందులో విషయం ఉందనుకున్నారు. కానీ.. అవన్నీ అడియాశలుఅయిపోయాయి. సరైనసబ్లిసిటీ లేకపోవడం, వెంకీ మామ నుంచి గట్టి పోటీ రావడంతో ఈసినిమాని ఎవరూ పట్టించుకోలేదు. ఫైనల్ రిజల్ట్ కూడా అలానే తయారైంది.
ఇక వెంకీ మామా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వెంకటేష్, నాగచైతన్య కలసి నటించిన సినిమా ఇది. అందుకే... ఈ రియల్ మల్టీస్టారర్ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. దానికి తగ్గట్టే తొలిరోజు వసూళ్లు భారీగా దక్కించుకుంది. అయితే సాదా సీదా కథలో మామా అల్లుళ్లని చూపించేద్దాం అన్న ప్రయత్నం మాత్రం దారుణంగా బెడసికొట్టింది. వెంకీ, చైతూల కెమిస్ట్రీ తప్ప ఇంకేం వర్కవుట్ అవ్వలేదు. వాళ్లిద్దరూ ఈ సినిమాని ఎంత వరకూ గట్టెక్కిస్తారన్నది పెద్ద ప్రశ్న. తొలి మూడు రోజులూ గడిచాక - ఆ వసూళ్ల వివరాలు బయటకు వచ్చాక గానీ, ఈ సినిమా ఆర్థికంగా గట్టెక్కుతుందా? లేదా? అనేది చెప్పలేం.
ఈనెల 20న బాక్సాఫీసు మరింత హుషారుగా కనిపించనుంది. ఎందుకంటే రూలర్, ప్రతిరోజూ పండగే, దొంగ రిలీజ్ అవుతున్నాయి. దాంతో పాటు హిందీ సినిమా దబాంగ్ 3 కూడా ఉంది.