2020 సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో `సరిలేరు నీకెవ్వరు` ఒకటి. ఈ సినిమాని పక్కా వాణిజ్య హంగులతో నింపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఓ ఐటెమ్ గీతాన్నీ జోడించాలని చూస్తున్నారు. మహేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. రష్మిక మందన్నా కథానాయిక. ఈ చిత్రంలోని ప్రత్యేక గీతం కోసం తమన్నాని సంప్రదించారని తెలుస్తోంది. మహేష్‌తో `ఆగడు` కోసం జోడీ కట్టింది తమన్నా. ఆ తరవాత.. ఇద్దరూ కలసి పనిచేయడం ఇదే తొలిసారి.
మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన `ఎఫ్ 2`లో తమన్నా ఓ కథానాయికగా నటించింది. ఆ పరిచయంతోనే ఈ పాటలో నటించడానికి ముందుకొచ్చినట్టు సమాచారం. సాధారణంగా తమన్నా స్పెషల్‌సాంగ్ అంటే భారీ ఎత్తున పారితోషికం అందుకుంటుంది. ఈ పాట కోసం కూడా దాదాపు 50 లక్షలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తనేమో ఐటెమ్ గీతాల స్పెషలిస్టు. మరి ఈసారి ఎలాంటి పాట కంపోజ్ చేశాడో??