మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతోందట. అయితే ఇప్పుడప్పుడే కాదట. కానీ పెళ్లికొడుకును చూసి పెట్టాల్సిన బాధ్యత మాత్రం మనపైనే వేసేసిందీ గడుసు పిల్ల. మంచివాడు, తెలిసిన కుర్రోడు ఉంటే చెప్పమంటోంది. 'దటీజ్ మహాలక్ష్మి' సినిమాలో రాజమండ్రి అమ్మాయిగా గోదావరి యాసలో మాట్లాడి మెప్పించనుంది. ఈ మహాలక్ష్మి మనం చూసిన అబ్బాయిని పెళ్లాడుతుందా.. అంటే ఈఫిల్ టవర్‌కీ, రాజమండ్రి బ్రిడ్జ్‌కీ ఎంచక్కా లింక్ పెట్టేసినట్లుంటుందన్నమాట.
ఇదిలా ఉంటే, తమన్నా ప్రస్తుతం చాలా బిజీ. ఏకంగా ఐదు సినిమాలు చేతిలో ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తమన్నా నటిస్తోంది. తెలుగులో తమన్నా నటించిన 'ఎఫ్ 2' సంక్రాంతికి విడుదల కానుంది. ఇక నెక్స్ట్ 'దటీజ్ మహాలక్ష్మి' విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ క్వీన్‌కి తెలుగు రీమేక్ ఇది. మరోవైపు ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' లో తమన్నా 'లక్ష్మి'గా కీలక పాత్ర పోషిస్తోంది. తమిళంలో 'అభినేత్రి' సిరీస్‌తో పాటు మరో చిత్రంలోనూ నటిస్తోంది. హిందీలోనూ ఓ చిత్రంలో నటిస్తోంది.
ఇలా తమన్నా ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతోంది. ఇలాంటి తరుణంలో పెళ్లి ఆలోచనే చేయరు ముద్దుగుమ్మలు. అయితే అది ఒకప్పటి మాట. ఇప్పుడు పెళ్లయినా వరుస ఆఫర్లు దక్కించుకుంటూ ఏమాత్రం మార్పు లేకుండా కెరీర్‌లో దూసుకెళ్తున్నారు హీరోయిన్లు. అలాగే తమన్నా సరదాకే అన్నా, టైమొచ్చిందంటే పెళ్లి చేసుకుని కూడా సినిమాల్లో నటించేయొచ్చు. ఏమో అదే జరగొచ్చేమో ఎవరికి తెలుసు.!