కోలీవుడ్ కి చెందిన నిర్మాత అశోక్ కుమార్ చెన్నై లోని తన నివాసంలో మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన శశికుమార్ కి ఈయన దగ్గర బంధువు. ఫైనాన్షియర్ వేధింపులు తట్టుకోలేక ఈ ఆత్మహత్య కి పాల్పడినట్లు ఆయన రాసిన లేఖలో పేర్కొన్నాడు.
స్థానిక ఆర్కాడు రోడ్డు ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో నివాసముండే అశోక్ సహ నిర్మాతగా, కంపెనీ ప్రొడక్షన్ లలో కూడా పనిచేశాడు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోవడంతో ఈ పని చేసినట్లు, గత ఆరు నెలలుగా ఫైనాన్షియర్ వేధిస్తున్నట్లు ఈ లేఖలో తెలిపాడు. అప్పుల వాళ్ళ వేధింపులతో మనస్థాపానికి గురై బలవన్మరణానికి గురైనట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సూసైడ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
అశోక్ కుమార్ ఆత్మహత్య పై నడిగర్ సంఘం అధ్యకుడు హీరో విశాల్ విచారం వ్యక్తం చేసాడు. ఫైనాన్షియర్ల ఒత్తిడి తట్టుకోలేక ఓ మిత్రుడు ప్రాణాలు తీసుకోవటం చాలా బాధాకరమని అన్నాడు. ప్రతి సమస్యకు ఆత్మహత్యే పరిష్కారం కాదని, ఫైనాన్షియర్ల నుండి ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే తమకు తెలియజేయాలని, వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుకు వస్తామని తెలియజేశాడు.
ఈ ఆత్మహత్య పై మరో హీరో సిద్ధార్ధ్ కూడా స్పందించాడు. అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకోవటం నా మనసు కలిచివేస్తుంది అని అన్నాడు. మరో నిర్మాత కానీ, రైతన్న కానీ ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు. అప్పుల ఒత్తిడి కారణంగా ఓ యువ నిర్మాత చనిపోయాడని వినడానికే చాలా బాధగా ఉంది. శశికుమార్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు.