డ్రగ్స్ సమాజానికి హానికరం, ప్రాణాంతకమని అంటున్నాడు యువ నటుడు తనీష్. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ యెదుట ఈ రోజు విచారణకు హాజరయ్యాడాయన. సుమారు 4 గంటలపాటు విచారణ జరిగింది. విచారణ ముగించుకున్న తర్వాత తనీష్, మీడియాతో మాట్లాడాడు. 'సిట్' బృందం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాననీ, డ్రగ్స్ ఇంతకుముందెప్పుడూ తీసుకోలేదని చెప్పాడు. తన తండ్రి మరణం తర్వాత తన కుటుంబ బాధ్యత అంత తన భుజాల మీద పడిందనీ, తన గురించి మీడియాలో వచ్చిన వార్తలతో తన కుటుంబం తీవ్రంగా కలత చెందిందని అన్నాడు తనీష్. డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి కార్యక్రమం చేపట్టినా పాల్గొనడానికి తాను సిద్ధమని తనీష్ వెల్లడించాడు. ఈ డ్రగ్స్ ఇష్యూ తన కెరీర్‌కి ఎలాంటి ఇబ్బంది కల్గించకూడదనీ తనీష్ కోరుకుంటున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన తనీష్ 'నచ్చావులే' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. లేటెస్టుగా కృష్ణవంశీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న 'నక్షత్రం' సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే తన కెరీర్ గాడిలో పడిందనీ, ఇంతలోనే ఈ డ్రగ్స్ ఆరోపణలు తనని చాలా ఆవేదనకి గురి చేశాయంటున్నాడు తనీష్. రేపు మరో యంగ్ హీరో నందు 'సిట్' యెదుట విచారణకు హాజరవుతాడు. ప్రముఖ గాయని గీతా మాధురి భర్త ఈ నందు.