టాలీవుడ్‌ని కుదిపేస్తున్న డ్రగ్స్ ఇష్యూలో విచారణల పర్వం కొనసాగుతూనే ఉంది. నోటీసులు అందుకున్న 12 మందిలో ఇంతవరకూ 10 మంది విచారణకు హాజరయ్యారు. ఇక మిగిలింది యంగ్ హీరోలు తనీష్, నందు. వీరిద్దరిలో తనీష్ ఈ రోజు సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. మొదట్లో నాకసలు నోటీసులే అందలేదన్నాడు తనీష్. మరి ఎందుకు విచారణకు హాజరయ్యాడు. నందు కూడా ఆ రోజు చాలానే హడావిడి చేశాడు. అయితే బహుశా ఆ రోజుకి వారికి నోటీసులు అందలేదు కాబోలు. రేపు హీరో నందు వంతు. ఏది ఏమైనా సిట్ ముందుకు ఈ ఇద్దరు హీరోలు కూడా హాజరు కాక తప్పలేదు. ఇదిలా ఉండగా, నటి ఛార్మి ఈ విషయమై కోర్టునాశ్రయించడం ఓ పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. ఆమె అభ్యర్థన మేరకు కోర్టు కొంత ఉపశమనం కూడా ఇచ్చింది. బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవద్దని కోర్టు చెప్పడంతో ఆ తర్వాత విచారణకు హాజరైన వారెవ్వరూ బ్లడ్ శాంపిల్స్‌ని పోలీసులకు ఇవ్వలేదు. సరికదా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్న వారిని ఎవ్వరినీ నిందితులుగా చూడడం లేదు. కేవలం బాధితులుగా భావిస్తున్నామంతే అన్న స్టేట్‌మెంట్‌తో టోటల్ డ్రగ్స్ ఎపిసోడ్ చప్పబడిపోయింది. అంత వరకూ విచారణకు హాజరయిన సినీ ప్రముఖుల్లో ఉన్న భయం, బెరుకు ఆ తర్వాత విచారణకు వచ్చిన వారిలో కనిపించలేదు. ఆ రకంగా తాజాగా విచారణను ఎదుర్కొంటున్న తనీష్‌కి టెన్షన్ లేనట్లే. అలాగే రేపు విచారణను రెడీ కావాల్సిన నందుది అదే పరిస్థితి. మొత్తానికి ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించిన విచారణలు రేపటితో పూర్తి కానున్నాయనే విషయం స్పష్టమవుతోంది. ఎక్సైజ్ శాఖ నెక్స్ట్ స్టెప్ ఏంటో తర్వాత చూడాలిక.