విజయ్ దేవరకొండ కెరీర్‌లో 'టాక్సీవాలా' రూపంలో మరో హిట్టు వచ్చి పడింది. నిజానికి ఈ సినిమాపై ఎవ్వరికీ నమ్మకాల్లేవు. విడుదలకు ముందే సినిమా లీకైపోయింది కూడా. ఆ సినిమా చూసినవాళ్లు సైతం `ఇదేం గొప్పగా లేదు` అంటూ పెదవి విరిచారు. అయినప్పటికీ.. ఈ సినిమా విడుదలై `హిట్` టాక్ అందుకుంది.
విజయ్ క్రేజ్ ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. 30 రోజుల్లో ఈ సినిమా రూ.20 కోట్ల మైలు రాయిని అందుకుంది. నైజాంలో రూ.7.70 కోట్లు సాధించిన టాక్సీవాలా.. ప్రపంచ వ్యాప్తంగా 21.30 కోట్లు అందుకుంది. అమెరికాలో 1.85 కోట్ల వసూళ్లు తెచ్చుకుంది. కృష్ణా, గుంటూరులో కోటికి పైగానే సాధించింది. తమిళనాడు, బెంగళూరు కలసి రూ.2.5 కోట్ల కలక్షన్లు వచ్చాయి.
రూ.4 కోట్లతో పూర్తయిన సినిమా ఇది. `పెళ్లి చూపులు` సమయంలోనే విజయ్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ లెక్కన... `టాక్సీవాలా`కుగానూ విజయ్‌కి అతి తక్కువ పారితోషికం అందిందనే చెప్పాలి. పెట్టుబడిగా పెట్టిన 4 కోట్లు డిజిటల్ హక్కుల రూపంలో వచ్చేశాయి. మిగిలినదంతా లాభమే. ఏ విధంగా చూసినా నిర్మాతలకు రూపాయికి నాలుగు రూపాయలు మిగిల్చిన చిత్రాల జాబితాలో టాక్సీవాలా కూడా చేరిపోతుంది.