డిసెంబరు 7న తెలంగాణ రాష్ట్రమంతా ఎలక్షన్ ఫీవరే. ఆంధ్రా రాజకీయాలు సైతం ఈ ఎన్నికలతో ముడి పడి ఉన్న నేపథ్యంలో అక్కడివాళ్లు కూడా ఈ పరిణామాలపై ఆసక్తిని కరబరిచారు. ఉదయం నుంచి సాయింత్రం 5 గంటల వరకూ.. ఓటింగ్ వేడి. ఆ తరవాత ఎగ్జిట్ పోల్‌ల సందడి. దాంతో.. `సినిమా` ఊసే లేకుండా పోయింది. డిసెంబరు 7న ఇలాంటి పరిస్థితి ఉంటుందని తెలిసినా.. కొన్ని సినిమాలు రిస్క్ చేసి రిలీజ్‌లకు రెడీ అయ్యాయి.
కవచం, సుబ్రహ్మణ్యపురం, నెక్ట్స్ ఏంటి?, శుభలేఖలు ఈచిత్రాలు శుక్రవారం విడుదలయ్యాయి. దేనికీ... ఓపెనింగ్స్ లేవు. హైదరాబాద్ సిటీలో అయితే... ఉదయం ఆటలన్నీ రద్దయ్యాయి. స్కూళ్లు, కార్యాలయాలకు సెలవలు కావడంతో.. జనం కూడా బయటకు రావడానికి ఇష్టపడలేదు. టీవీ సెట్ల ముందు అతుక్కుపోయారు.
చివరికి ఫస్ట్ షో, సెకండ్ షోలు కూడా చాలా డల్‌గా సాగాయి. దాంతో... ఆయా చిత్రాల నిర్మాతలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రా వసూళ్లపై కూడా పడిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సాయింత్రానికి రివ్యూలు, రిపోర్టులు బయటకు వచ్చేయడంతో... రాత్రి ఆటలు చూడ్డానికి కూడా ప్రేక్షకులు ఆసక్తికరబరచలేదు. కనీసం శని, ఆదివారాలైనా ప్రేక్షకుల మనసు సినిమాలవైపు లాగుతుందన్నది నిర్మాతల నమ్మకం.