గుండు హనుమంతరావు చాలా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు. సీనియర్ నటుడు అయిన గుండు హనుమంతరావు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ విషయం ఆయనకు మెగాస్టార్ చిరంజీవి సాయం చేసేదాకా ఎవరికీ తెలియకపోవడం శోచనీయం. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, సినీ పరిశ్రమలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారిని ఆదుకుంటున్నట్లు ఎప్పటికప్పుడు చెబుతున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు వెలుగు చూసిన ప్రతిసారీ సినీ పరిశ్రమ వివాదాల్లోకెక్కుతుంటుంది.
గుండు హనుమంతరావు అనారోగ్యం, ఆయన ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయి. తెలంగాణ ప్రభుత్వమూ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఐదు లక్షల రూపాయల్ని గుండు హనుమంతరావుకి అందజేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం తరఫున ఇలాంటి విషయాల్లో ఎంత సాయం అందినా అది తక్కువే. అలాగే, సినీ పరిశ్రమ నుంచి కూడా. సినీ పరిశ్రమ ఇలాంటి సందర్భాల్లో చేయాల్సింది చాలా ఉంటుంది.
కళాకారులకు అవకాశాలు తగ్గుతున్నప్పుడు, వారిని ప్రోత్సహించవలసి ఉంటుంది. ఆ ప్రోత్సాహమే వారిలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అందుకు తగ్గ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, కొత్త వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా పాతవారికి అవకాశాలు తగ్గిపోవడం, అలా అవకాశాలు తగ్గాక ఇండస్ట్రీకి దూరంగా ఉండటం జరుగుతుంటాయి. ఏదేమైనా గుండు హనుమంతరావు పూర్తిగా కోలుకోవాలి. గతంలో ఆయన తెరపై పంచిన నవ్వుల్ని ఎప్పటికీ మర్చిపోలేం. మళ్ళీ ఆ నవ్వులు తెరపై కన్పించాలి. అలా కన్పించలంటే ఆయనకు అవకాశాలు ఇచ్చి మన దర్శక నిర్మాతలు ప్రోత్సహించాలి, ప్రోత్సహిస్తారని ఆశిద్దాం.