సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి కుమారుడు, 'మత్తు వదలరా' చిత్రంతో హీరోగా పరిచయమై ఆకట్టుకున్న శ్రీసింహా కోడూరి నటిస్తోన్న రెండో చిత్రం 'తెల్లవారితే గురువారం'. సంక్రాంతి పర్వదినం సందర్భంగా గురువారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 'మత్తు వదలరా' భిన్నతరహా చిత్రంగా పేరు తెచ్చుకోగా, ఆ చిత్రంలో ప్రదర్శించిన అభినయంతో శ్రీసింహా ప్రతిభావంతుడైన నటునిగా అందరి ప్రశంసలూ పొందారు.
ఇప్పుడు 'తెల్లవారితే గురువారం' లాంటి మరో కొత్త తరహా చిత్రాన్ని ఆయన చేస్తున్నారు. టైటిల్ ఎంత విలక్షణంగా ఉందో, పోస్టర్‌ను అంత ఆసక్తికరంగా డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌లో పెళ్లికొడుకు గెటప్‌లో మహారాజా కుర్చీలో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ కనిపిస్తున్నారు శ్రీసింహా. ఆయన చేతిలో పెళ్లి దండ కూడా ఉంది. శ్రీసింహా సరసన నాయికలుగా చిత్రా శుక్లా, మిషా నారంగ్ నటిస్తున్నారు. ఈ చిత్రంతో మణికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
సాయి కొర్రపాటి సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'కలర్ ఫొటో'తో లాక్‌డౌన్‌లో లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సూపర్ హిట్‌ను అందించింది. తండ్రి ఎం.ఎం. కీరవాణి తరహాలో బాణీలు కడుతూ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్న కాలభైరవ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌లో ఉంది. మార్చి నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.