సినీ పరిశ్రమకీ, రాజకీయాలకీ సన్నిహిత సంబంధాలున్నాయి. తమిళనాడులోనూ, తెలుగునాట కూడా ఈ రాజకీయ - సినీ బంధం ప్రత్యేకం. స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగునాట సినీ రాజకీయాలకు సంబంధించి తిరుగులేని 'స్టార్' అని చెప్పక తప్పదు. రాజకీయాల్లోకి వస్తూనే తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారాయన.
ప్రస్తుతం రాజకీయాల్లో చాలామంది సినీ ప్రముఖులున్నారు. కొందరు ప్రత్యక్ష రాజకీయాల్లో, ఇంకొందరు పరోక్ష రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ హీరోయిన్, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా వుందట. సినిమాల్లో హీరోయిన్‌గా బిజీగా వుంటూనే, ఆమె రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నట్లు తెలుస్తోంది. పైగా ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించాలనుకుంటోందట. అయితే ఆమె ఎవరన్నది సస్పెన్స్‌గా మారింది.
తెలంగాణలో అయితే అక్కినేని సమంతని రాజకీయాల్లోకి తెచ్చేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సన్నాహాలు చేస్తోందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే. సికింద్రాబాద్ నుంచి ఆమె టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయవచ్చంటున్నారు. అయితే అక్కినేని కాంపౌండ్ ఈ ప్రచారాన్ని లైట్ తీసుకుంది. కర్నాటకలో హీరోయిన్ రమ్య, రాజకీయాల్లో యాక్టివ్‌గా వుంది. కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఆమె గతంలో ప్రాతినిథ్యం వహించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేయబోతోందట.
ఏపీ రాజకీయాల విషయానికొస్తే, అధికార పార్టీ ఓ ప్రముఖ హీరోయిన్‌తో సంప్రదింపులు జరుపుతోందనీ, తెలుగులో బాగా మాట్లాడగలిగే ఆ భామ ఉత్తరాదికి చెందిన హీరోయిన్ అనీ తెలుస్తోంది. సినీ నటి జయప్రద తెలుగమ్మాయే అయినా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో రాణించారు. అలా ఉత్తరాది భామ ఏపీ రాజకీయాల్లో హల్‌చల్ చేస్తుందేమో చూడాలిక.