ఇంకో ఇరవై రోజులపాటు ఎదురుచూడాల్సిందే.. ఆ తర్వాత కూడా పరిస్థితులు సానుకూలంగా మారతాయన్న నమ్మకం లేదు. మరేం చేయాలి.? వున్నది ఒకే ఒక్క అవకాశం.. అదే డిజిటల్ స్ట్రీమింగ్. కొందరు నిర్మాతలు ఈ దిశగా సమాలోచనలు చేస్తున్నారట. పైగా, డిజిటల్ స్ట్రీమింగ్‌కి సంబంధించి నిర్మాతల ముందు టెంప్టింగ్ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. సో, అతి త్వరలో కొన్ని సినిమాల నుంచి ‘డిజిటల్ స్ట్రీమింగ్’పై ఓ సానుకూల ప్రకటన రావొచ్చని అంటున్నారు. ఓ యంగ్ హీరో తొలుత నిరాకరించినా, చేసేది లేక, నిర్మాత ఒత్తిడి మేరకు తన సినిమాని డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా విడుదల చేయడానికి ఒప్పుకోవాల్సి వచ్చిందట.
సినిమా పెద్ద స్క్రీన్లపై విడుదలయి, ఫర్వాలేదన్పించినా రానంత సొమ్ములు ఇచ్చే దిశగా ఆయా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నిర్వాహకులు ఆఫర్లు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా, ‘మా సినిమాని వెండితెర మీదనే ప్రదర్శిస్తాం. అవసరమైతే కొంత సమయం వేచి చూస్తాం..’ అని కొందరు నిర్మాతలు మాత్రం తెగేసి చెబుతున్నారు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత చూస్తోంటే, ఇంకో నాలుగైదు వారాల పాటు సినిమా ది¸యేటర్లు తెరుచుకోవడం కష్టంగానే కన్పిస్తోంది. ఆ తర్వాత అయినా పరిస్థితులు అనుకూలంగా మారతాయని ఇప్పుడే ఎలా చెప్పగలం.? అందుకే, కొందరు ధైర్యం చేసి డిజిటల్ స్ట్రీమింగ్ వైపు వెళ్ళాల్సి వస్తోందట.