ఈ ఏడాది ఇయర్ ఎండింగ్ బాక్సాఫీస్ పోరు గట్టిగానే నెలకొంది. మామూలుగా అయితే, ఇది అన్ సీజన్‌గా పరిగణిస్తారు. సంక్రాంతి సీజన్‌కి ఎన్ని సినిమాలనైనా తన భుజ స్కంధాలపై మోసే స్టామినా ఉంటుంది. అందుకే సినిమాలన్నీ సంక్రాంతి బరిలో నిలిచేందుకే పోటీ పడతాయి. కానీ, ఈ సారి అలా కాదు, ఇయర్ ఎండింగ్ పోరు కూడా పండగ సీజన్‌నే తలపిస్తుండడం విశేషం. సంక్రాంతి సీజన్‌ని ఎప్పుడూ మిస్ కాని బాలయ్య, ఈ సారి సంక్రాంతి సీజన్‌ని పక్కన పెట్టేసి, డిశంబర్ నెలపై కన్నేశాడు.
ఈ నెల 20న బాలయ్య నటిస్తున్న 'రూలర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. బాలయ్య ఎంతో నచ్చి, మెచ్చిన రైతు కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. టైటిల్‌తో పాటు, సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో 'రూలర్' ఈ ఇయర్ ఎండింగ్ రారాజు అవుతాడని అంటున్నారు. దీంతో పాటు, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పోటీకొస్తున్నాడు.
'ప్రతిరోజూ పండగే' అంటూ తన ఫ్యామిలీ గ్యాంగ్‌ని వెంటేసుకొస్తున్నాడు. పండగ ముందే పండగలాంటి సినిమాతో తేజు వస్తుండడం, అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఎంటర్‌టైన్ చేసేలా ఈ సినిమా కాన్సెప్ట్ ఉండడంతో, 'ప్రతిరోజూ పండగే' పైనా అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక వీరిద్దరితో పాటు, బాలీవుడ్ నుండి 'దబాంగ్ 3', కోలీవుడ్ నుండి 'దొంగ' కూడా పోటీకొస్తున్నాయి. తెలుగుతో సమానంగా ఈ సినిమాలకూ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. సో ఈ ఇయర్ ఎండింగ్ బాక్సాఫీస్ వద్ద సినిమాలు కళకళలాడుతున్నాయి. కాసుల గల గల ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.