తమన్.. ఇప్పుడు అందరి నోటా.. ఇదే మాట. తమన్ ఉంటే.. చాలు సినిమాని ఏదోలా హిట్ చేసేస్తాడని నమ్ముతున్నారు. ముఖ్యంగా తన ఆర్.ఆర్‌తో సినిమాని మరో స్థాయిలోకి తీసుకెళ్తున్నాడని భావిస్తున్నారు. అందుకే.. ఏ పెద్ద సినిమా అయినా తమన్ ఉండాల్సిందే. తమన్ తో దాదాపు దర్శకులంతా ఫ్రెండ్లీగానే ఉంటారు. తమన్ కూడా అంతే. కానీ ఓ దర్శకుడితో మాత్రం తమన్ కి ఈగో క్లాష్ వచ్చిందన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆ వివరాల్లోకి వెళ్తే..
మజిలీ, నిన్నుకోరి చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్నాడు శివ నిర్వాణ. తనకీ తమన్ కీ పడడం లేదట. దానికి కారణం.. టక్ జగదీష్ సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకుడు. తమన్ సంగీతం అందించాడు. అయితే.. ఈ సినిమా కి ఆర్.ఆర్ ఇచ్చే విషయంలో తమన్ చాలా జాప్యం చేశాడట. అసలు ఈ సినిమాని పట్టించుకోలేదని, పెద్ద సినిమాల జోష్‌లో పడి, నాని సినిమాని పక్కన పెట్టాడని, దాంతో చివరి నిమిషాల్లో శివ నిర్వాణ.. గోపీ సుందర్ ని రంగంలోకి దించి, ఆర్.ఆర్ కొట్టించుకున్నాడని, అప్పటి నుంచీ శివకీ, తమన్ కీ చెడిందని భోగట్టా.
ఇటీవల శివ నిర్వాణ... కొత్త సినిమా మొదలెట్టాడు. విజయ్ దేవరకొండతో ఓ సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకి తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు. శివ కూడా తమన్ దగ్గరకు వెళ్లి మాట్లాడాడట. `పాతవన్నీ మర్చిపోదాం. కలిసి పనిచేద్దాం` అన్నాడట. కానీ తమన్ మాత్రం `నీతో పనిచేయను` అని తెగేసి చెప్పాడట. దాంతో.. శివ నిర్వాణ ఇప్పుడు మలయాళం నుంచి ఓ కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ని తెచ్చుకోవాల్సివచ్చింది. తమన్ చిన్న, మీడియం సినిమాలకు అందుబాటులో ఉండడం లేదని, ఎవరైనా చిన్న నిర్మాత తమన్ దగ్గరకు వెళ్తే.. `నేను వంద కోట్ల సినిమాలే చేస్తున్నా` అని మొహమాటం లేకుండా చెబుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.