చిరంజీవి రెండు రీమేక్‌లకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. లూసీఫర్, వేదాళం చిత్రాలను చిరు పట్టాలెక్కించాలనుకున్నారు. అయితే లూసీఫర్ పై చాలా రూమర్లు వచ్చాయి. ఈ సినిమాకి ముందు సుజిత్ ని దర్శకుడిగా తీసుకున్నారు. ఆ తరవాత వినాయక్ వచ్చాడు. ఇప్పుడు మోహన్ రాజా పనిచేస్తున్నాడు. మోహన్ రాజా సైతం ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని, ఏకంగా లూసీఫర్ రీమేకే ఆగిపోయిందన్న వార్తలు వచ్చాయి. వీటిపై చిరు టీమ్ తమదైన స్టైల్ లో స్పందించింది.
తమన్ తో మోహన్ రాజా ఉన్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో వదిలింది చిత్రబృందం. `లూసీఫర్` మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి అనే సంకేతాలు పంపింది. దాంతో... లూసీఫర్ రీమేక్ పై జనాల ఊహాగానాలకు ఒక్క ఫొటోతో తెర దించినట్టైంది. లూసీఫర్ రీమేక్ కి తమన్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. చిరు సినిమాకి పని చేయడం తమన్ కి ఇదే తొలిసారి `మెగాస్టార్ పై ఉన్న ప్రేమ చూపిచుకునే సమయం వచ్చింది` అంటూ తమన్ కూడా సంతోషంగా ట్వీట్ చేశాడు. టాలీవుడ్ లోని పెద్ద హీరోలందరికీ సంగీతాన్ని ఇచ్చి, వాళ్ల విజయాలలో భాగం పంచుకున్న తమన్ .. తొలిసారి చిరుతో పనిచేస్తున్నాడంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. సో... ఈసారి ఆల్బమ్ ఏ రేంజులో ఉంటుందో చూడాలి.