శంకర్ ఆలోచనలు అన్ని విషయాల్లోనూభారీగానే ఉంటాయి. తన టెక్నీషియన్లనీ అలానే ఎంచుకుంటాడు. రెహమాన్ తో పనిచేయడం అంటే.. శంకర్‌కి భలే ఇష్టం. తనే... హిట్ పాటల్ని అందించిపెట్టాడు. ఇప్పుడు శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. `భారతీయుడు 2` తరవాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ఈ సినిమాకి రెహమాన్ సంగీత దర్శకుడు అని ముందు నుంచీ ప్రచారం జరుగుతూనే ఉంది.
చరణ్‌కి కూడా రెహమాన్ తో ఓ సినిమా చేయాలన్న కోరిక. అది శంకర్ సినిమాతో తీరబోతోందనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి... తమన్ వచ్చినట్టు టాక్. శంకర్ సినిమాకి తమన్ పనిచేయడం ఇదే తొలిసారి. శంకర్ కూడా రెహమన్ నే ఖాయం చేద్దామనుకున్నాడు. అయితే రెహమాన్ తెలుగు ప్రేక్షకుల నాడి సరిగా పట్టుకోలేకపోయాడన్న భయం... శంకర్ లో ఉంది.
పులి లాంటి సినిమాలకు సంగీతం రెహమానే అందించాడు. కానీ.. అవుట్ పుట్ సరిగా లేదు. దాంతో ఆ రిస్క్ తీసుకోవడం శంకర్ కి ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే తెలుగు ప్రేక్షకుల పల్స్ బాగా పట్టేసిన తమన్ ని ఈ సినిమా కోసం ఎంచుకున్నాడని తెలుస్తోంది. తమన్ కోసం రెహమాన్ లాంటి వాడ్ని పక్కన పెట్టడం సాహసమే. కానీ.. ఇప్పుడు రెహమాన్ తో పోలిస్తే తమనే ఫామ్ లో ఉన్నాడు.కాబట్టి తప్పడం లేదు.