అన్ లాక్ ప్రక్రియలో థియేటర్లలకు ఊరట లభించింది. థియేటర్లు తెరచుకోవచ్చని ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. అయితే... థియేటర్లు మాత్రం ఇప్పట్లో తెరచుకునేలా లేవు. థియేటర్ల యాజమన్యాలు ముక్త కంఠంతో `థియేటర్లు తెరవడం కష్టం.. మా వల్ల కాదు బాబోయ్` అనేస్తున్నాయి. దానికి కారణాలు అనేకం.
50 శాతం టికెట్లతోనే సినిమా హాళ్లు నడుపుకోవడానికి ఎవరికీ ఇష్టం లేదు. పైగా శానిటజైషన్ పేరుతో ఇప్పుడు అదనంగా ఖర్చు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా థియేటర్లని సిద్ధం చేయాలంటే ఒక్కో థియేటర్ కీ అదనంగా 6 నుంచి 8 లక్షల వరకూ ఖర్చు అవుతుందట. ఈ ఖర్చుని భరించడానికి థియేటర్ల యాజమాన్యం సిద్ధంగా లేదు. పైగా.. థియేటర్లు తెరిచినా - ఏ సినిమాలు విడుదల అవుతాయో ఓ క్లారిటీ కూడా లేదు. కొత్త సినిమాలు అందునా, స్టార్ హీరోల సినిమాలు వస్తే గానీ, అసలు సినిమా చూడాలన్న ఆసక్తి జనాలకు ఉందా, లేదా? అనే విషయంపై ఓ క్లారిటీ రాదు.
ఈ ఖర్చులు భరించి, 50 శాతం సిట్టింగ్ కి ఓకే అనాలంటే... టికెట్ రేట్లని పెంచడం మినహా మరో మార్గం లేదు. కానీ... థియేటర్ యాజమాన్యం, నిర్మాతలూ అందుకు సిద్ధంగా లేరు. ఇప్పటికే జనాలు థియేటర్లకు రావడం మానేశారని, టికెట్ రేట్లు పెంచితే అస్సలు రారని చెబుతున్నారు. థియేటర్ యాజమాన్యం కొన్ని కీలకమైన డిమాండ్లు చేస్తోంది. అందులో.. లాక్ డౌన్ కాలంలో కరెంటు బిల్లుల్ని రద్దు చేయడం ప్రధానమైనది. దాంతో పాటు.. పార్కింగ్ డబ్బులు వసూలు చేసే అవకాశం ఇవ్వడం. ఈ రెండు విషయాల్లోనూ ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తే - అప్పుడు వాళ్లకీ కాస్త ఉత్సాహం రావొచ్చు. ప్రస్తుతానికైతే... ఈనెల 15 నుంచి థియేటర్ల తీతకు అనుమతి ఇచ్చినా, దీపావళి వరకూ కొత్త సినిమాలు వచ్చే అవకాశం లేదు. థియేటర్ల దగ్గర సందడి చూసే అదృష్టమూ దక్కదు.