సినిమా అభిమానులకు ఇది శుభవార్త. దాదాపు రెండు నెలలుగా మూతబడిన థియేటర్ల తలుపులు త్వరలో తెరచుకుంటున్నాయి. ఏపీ ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. అన్నీ కుదిరితే జూన్ 1 నుంచి.. థియేటర్లు తెరచుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన మార్గ దర్శకాలపై జగన్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. థియేటర్లో సిట్టింగ్ సిస్టమ్ ఎలా ఉండాలి? ప్రదర్శన వేళల సంగతేంటి? థియేటర్ల చుట్టు పక్కల ఉన్న షాపింగ్ మాల్స్ తెరచుకోవచ్చా? మల్టీప్లెక్సుల సంగతేంటి? వీటిపై జగన్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కరోనా కేసులు అతి తక్కువగా ఉన్న గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సినిమా హాళ్ల ప్రదర్శనలకు ఎలాంటి ఆటంకాలూ ఉండకపోవొచ్చు. రెడ్ జోన్లూ, కంటోన్మెంట్ జోన్లలో మాత్రం యధాతధ స్థితి కొనసాగుతుంది.
వీటితో పాటు షూటింగుల అనుమతి విషయంలోనూ చర్చలు జరుగుతున్నాయి. జూన్ 1 కంటే ముందే షూటింగులకు అనుమతి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే.. షూటింగుల విషయంలో కొన్ని కఠినమైన నిబంధనల్ని పాటించాల్సివుంటుంది. సెట్లో 20 నుంచి 30 మందికే అనుమతి ఇస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలోనూ ఇలాంటి నిబంధనలే ఉంటాయి. త్వరలోనే షూటింగుల విషయంలోనూ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది.