2020 చిత్రసీమకు ఓ బ్లాక్ ఇయర్. ఆ యేడాది కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పుడిప్పుడే చిత్రసీమ కోలుకుంటోంది. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. ఉప్పెన, జాతిరత్నాలు లాంటి సినిమాలు బాగా ఆడడడంతో.. చిత్రసీమకు మళ్లీ ఊపొచ్చింది. మార్చి, ఏప్రిల్, మే, జూన్... ఇలా ప్రతీ నెలలోనూ నాలుగైదు క్రేజీ సినిమాలున్నాయి. చిరు, పవన్, బాలయ్య, వెంకీ ఇలా అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దాంతో.. టాలీవుడ్ కి మళ్లీ కొత్త కళ వచ్చింది. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ భయపెడుతోంది. తెలుగు రాష్ట్రాలలో భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో... మరోసారి లాక్ డౌన్ భయాలు వెంటాడుతున్నాయి. లాక్ డౌన్ కంటే ముందు ప్రభుత్వాలు థియేటర్లు, షాపింగ్ మాల్స్ పై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే... తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థల్ని బంద్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంత వరకూ వస్తే.. ముందుగా థియేటర్లే మూతపడతాయి. అదే జరిగితే.. చిత్రసీమ మరోసారి కుదేలవ్వడం ఖాయం. ఎందుకంటే ఈసీజన్‌లో భారీగా సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. నిర్మాతలు ఆయా సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టారు. మళ్లీ థియేటర్లని మూసేస్తే... వాళ్లు తేరుకోలేరు. కరోనా సెకండ్ వేవ్ ఎలా ఉంది? ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి? అనే విషయంపై నిర్మాతలు సీరియస్ గా దృష్టి సారించారు. అందుకే వీలైనంత త్వరగా తమ సినిమాల్ని విడుదల చేసేయాలని కొంతమంది ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది నిర్మాతలు.. తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటే మంచిదన్న ఆలోచనలో ఉన్నట్టు టాక్. మరి.. ఏం జరగబోతోందో చూడాలి.