కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమ కనీ వినీ ఎరుగని సంక్షోభాన్ని చవిచూస్తోంది. ఎట్టకేలకు కరోనా నుంచి కొంత ఉశమనం కలుగుతుండడంతో, సినిమా థియేటర్లు కూడా తెరచుకున్నాయి. ఇక, థియేటర్లకు ప్రేక్షులు వెళ్లడమే ఆలస్యం. ప్రేక్షకులు వస్తున్నారనే నమ్మకం సినీ పరిశ్రమకి కలిగితే, సినిమాలూ పోటెత్తుతాయ్. వారానికి ఓ రెండు మూడు సినిమాలు, వీలైతే నాలుగైదు సినిమాలు.. ఇంకా కుదిరితే ఓ అరడజను సినిమాలు థియేటర్లలో సందడి చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
'ఒరేయ్ బుజ్జిగా' థియేటర్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. 'సోలో బ్రతుకే సో బెటరు' ప్రేక్షకుల్ని అలరిస్తానంటోంది. 'క్రాక్' కూడా ప్రేక్షకుల్ని రారమ్మని పిలుస్తోంది. అభిమాన తారలు, మమ్మల్ని వెండితెరపై చూడరా.? అంటూ అడుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ, సినిమాల థియేటర్లకు కుటుంబ సమేతంగా వెళ్ళిపోవడమే. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. సో, ప్రపంచ వ్యాప్తంగా సినిమాకి ఏర్పడ్డ ప్రతిబంధకాలు పూర్తిగా తొలగిపోనున్నాయన్నమాట.
సినిమా అంటే అదో బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ చాలామందికి. సినిమా ఓ పెద్ద పరిశ్రమ.. తెలుగు సినీ పరిశ్రమనే తీసుకుంటే, వందలాది, వేలాది మందికి ప్రత్యక్ష ఉపాది.. లక్షలాదిమందికి పరోక్ష ఉపాధి. సినిమాని బతికించుకోవడం మనందరి అవసరం. అదే సమయంలో, ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే క్రమంలో, ప్రేక్షకుడి జేబు గురించి కూడా సినీ పరిశ్రమ పెద్దలు ఆలోచిస్తే మంచిది.