సినిమా థియేటర్లు తెరచుకోనున్నాయ్. డిసెంబర్ 4 నుంచి సినిమా థియేటర్లలో 'బొమ్మ' పడుతుందని ఓ ప్రముఖ మల్టీప్లెక్స్ ప్రకటించింది. దాంతో, సినీ పరిశ్రమలో జోష్ కనిపిస్తోంది. నిజానికి, సినిమా థియేటర్లు తెరచుకునేందుకు కేంద్రం గతంలోనే అనుమతిచ్చింది. అయితే, సినీ పరిశ్రమ కొంత అయోమయంలో పడింది.
రాష్ట్ర ప్రభుత్వాలూ ఆచి తూచి అడుగులేశాయి కరోనా నేపథ్యంలో. అయితే, కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, సినిమా థియేటర్లు తెరచుకునేందుకు అనుమతిచ్చింది. కాగా, డిసెంబర్ 25న తమ సినిమా రిలీజ్ చేస్తున్నామంటూ 'సోలో బ్రతుకే సో బెటర్' టీమ్ ప్రకటించిన విషయం విదితమే. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ఇది. డిసెంబర్ 4న థియేటర్లు తెరచుకున్నా, కొత్త సినిమాలు, పెద్ద సినిమాలు విడుదలయ్యేందుకు తగిన సమయం తప్పనిసరి.
మధ్యలో 21 రోజుల సమయం వుంది. ఈలోగా థియేటర్లకు ప్రేక్షకులు ఎలా వస్తారన్నదానిపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్నాయి.. విందులు, వినోదాలూ నడుస్తున్నాయి. సో, సినిమా థియేటర్లకి పెద్దగా సమస్య వుండకపోవచ్చు. థియేటర్లు తెరచుకుంటే, హౌస్‌ఫుల్ బోర్డు పడటం ఖాయం. అయితే, పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రేక్షకుల్ని సినిమా థియేటర్లలోకి అనుమతించాలన్న నిబంధన.. వసూళ్ళపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నష్టాలకు సిద్ధమై సినిమాల్ని విడుదల చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమే అయినా.. తప్పదేమో.!