సినీ రంగాన్ని పైరసీ పట్టి పీడిస్తోంది. పైరసీ బారిన పడకుండా తప్పించుకోవడమెలాగో ఏ నిర్మాతకీ తెలియడంలేదు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలాంటి తేడాలు ఏమీ లేవు పైరసీకి. ఏ బాషలో అయినా ఓ సినిమా వస్తోందంటే ముందు పైరసీ అక్కడ వాలిపోతోంది. తాజాగా పైరసీ బారిన పడింది ఓ బాలీవుడ్ సినిమా. అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ' సినిమాని విడుదలకు ముందే లీక్ చేసేశారు. ఈ విషయం తెలిసి చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులు షాక్‌కి గురయ్యారు. సినిమా మొత్తం పైరసీ బారిన పడింది. ఆగస్ట్ 11న సినిమా విడుదల కానుండగా, ఈ లోగానే సినిమా పైరసీ బారిన పడటం సంచలనంగా మారింది. తెలుగులో 'అత్తారింటికి దారేది' సినిమాని ఇలాగే విడుదలకు ముందు పైరసీ చేసేశారు. దాంతో చేసేది లేక ముందు అనుకున్నదానికన్నా కొన్ని రోజుల ముందు సినిమాని విడుదల చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నిర్మాతకి అండగా పవన్‌కళ్యాణ్ నిలిస్తే, సినిమాకి అండగా అభిమానులు నిలిచారు. ఏదేమైనా పైరసీ దారులను కఠినంగా శిక్షించలేకపోతుండడమే ఇలాంటి అనర్ధాలకు కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 'పైరసీని వ్యతిరేకించండి' అంటూ 'టాయ్‌లెట్ ఏక్ ప్రేమకథ' నటుడు అక్షయ్‌కుమార్ తన అభిమానులకి, సినీ అభిమానులకి విజ్ఞప్తి చేస్తున్నాడుగానీ, సినిమాకి జరగాల్సిన నష్టం ముందే జరిగిపోయింది.